Begin typing your search above and press return to search.

అంబానీల కథ:తమ్ముడి ఫ్లాప్..అన్న హిట్

By:  Tupaki Desk   |   19 Jun 2019 8:37 AM GMT
అంబానీల కథ:తమ్ముడి ఫ్లాప్..అన్న హిట్
X
తండ్రి ధీరుబాయ్ అంబానీ విస్తరించిన సామ్రాజ్యం అదీ.. ఆయన మరణం తర్వాత పెద్ద కొడుకు ముఖేష్ అంతకుమించిన లాభాలు తెచ్చిపెట్టాడు. అయితే ఆస్తులు పంచాలని చిన్న కొడుకు అనిల్ అంబానీ ఎప్పుడైతే పట్టుబట్టాడో అప్పుడే ఆయన పతనం ప్రారంభమైంది. మొత్తం కంపెనీల్లో సగం అనిల్ అంబానీ తీసుకోగా.. సగం ముఖేష్ అంబానీకి వెళ్లాయి. అయితే ఇక్కడే ఓడలు బండ్లు.. బండ్లు ఓడలయ్యాయి.

2008లో ఆస్తులు పంచుకున్నప్పుడు తమ్ముడు అనిల్ అంబానీ ఆస్తుల విలువ 42 బిలియన్ డాలర్లు అంటే అక్షరాల 2.9 లక్షల కోట్లు. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత సంపాదన కలిగిన వారిలో అనిల్ అంబానీ అప్పుడు 6వ స్థానంలో నిలిచి ఔరా అనిపించారు.

అయితే 11 ఏళ్లు గడిచాయి.. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వ్యాపారాల్లో లోటు పాట్లతో నష్టం వాటిల్లింది.. అత్యంత దారుణమైన నష్టాలతో ఇప్పుడు అనిల్ అంబానీ కంపెనీలు అప్పుల పాలై కేవలం 5000 కోట్ల ఆస్తులకు పరిమితమయ్యాయి. అనిల్ అంబానీ కంపెనీల షేర్లన్నీ పతమవుతూనే ఉన్నాయి. ప్రమోటర్లు తమ వాటాల్లో అత్యధికంగా రుణాలు తీసుకున్నారు. అనిల్ అంబానీ తాకట్టు పెట్టకుండా ఉంచుకున్న వాటా విలువ కేవలం 500 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే 2008లో 2.9 లక్షల కోట్లు ఉన్న ఆస్తుల విలువ ఇప్పుడు 90శాతం కరిగిపోయి 5000 కోట్లకు పరిమితమైందన్న మాట.

అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పటికే అనిల్ అంబానీ రిలయన్స్ క్యాపిటల్ లో 42.88శాతం వాటా - బిగ్ ఎఫ్ ఎం లను అమ్మేసేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. ముంబైలోని విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యాపారాన్ని ఆదానీ గ్రూపునకు అమ్మేశారు.

ఇలా తమ్ముడు అనిల్ అంబానీ అప్పుల పాలు అయితే.. ముఖేష్ అంబానీ మాత్రం వినూత్న వ్యాపార పోకడలు.. నవతరం బిజినెస్ ఐడియాలతో వ్యాపారాన్ని విస్తరిస్తూ దేశంలోనే నంబర్ 1 కుబేరుడిగా నిలిచాడు. ఇప్పుడు ముఖేష్ గ్రూపు ఆస్తుల విలువ 7.5 లక్షల కోట్లకు పైగానే.. అన్న ముఖేష్ సంపదలో తమ్ముడు ఆస్తుల విలువ 2 శాతం కూడా లేకపోవడం గమనార్హం. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా గత సంవత్సరం ముఖేష్ అందుకున్న డివిడెండ్ ఆదాయమే రూ.14500 కోట్లు కావడం విశేషం. అనిల్ కంపెనీల విలు 5వేల కోట్లు అయితే ముఖేష్ డివెడెంట్ల ఆదాయమే 14500 కోట్లు అంటే అనిల్ అంబానీ కంటే ముఖేష్ అంబానీ ఎంత ఎత్తులో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా తమ్ముడు అనిల్ వ్యాపార నష్టాలకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంక్షోభమే కారణం. దీనికి తోడు వ్యాపారాలను తప్పుగా నిర్మించడం.. తనఖా ఉంచి షేర్లు విక్రయాలు - తక్కువ మార్జిన్లు - తక్కువ క్యాష్ ఫ్లో తో కూడిన వ్యాపారాలే అనిల్ గ్రూపు నష్టాలకు కారణమని మార్కె విశ్లేషకులు చెబుతున్నారు.