Begin typing your search above and press return to search.

అంబానీ.. ఇప్పుడు ఆసియా కుబేరుడు

By:  Tupaki Desk   |   2 Nov 2017 5:03 AM GMT
అంబానీ.. ఇప్పుడు ఆసియా కుబేరుడు
X
కోటి రూపాయిలు సంపాదించాలంటే ఒక వ్య‌క్తికి జీవితం మొత్తం క‌ష్ట‌ప‌డినా సాధ్యం కాదు. అలాంటిది రూ.3వేల కోట్ల రూపాయిలు ఒక్క‌రోజులో సంపాదించ‌టం సాధ్య‌మేనా? అంటే.. కుద‌ర‌నే కుద‌ర‌ద‌ని చెబుతారు. కానీ.. అంబానీ విష‌యంలో అలాంటి అసాధ్యాల‌న్నీ సుసాధ్యాల‌వుతాయి. దేశంలో అత్యంత సంప‌న్నుడైన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆస్తి ఒక్క‌రోజులో రూ.3వేల కోట్ల రూపాయిల‌కు పెరిగిపోయింది.

ప్ర‌పంచ బ్యాంకు విడుద‌ల చేసిన తాజా నివేదిక‌లో వ్యాపారం చేయ‌టానికి అనువుగా ఉండే దేశాల జాబితాలో భార‌త్ ఏకంగా 30 స్థానాలు పైకి రావ‌టంతో భార‌త స్టాక్ మార్కెట్ క‌ళ‌క‌ళ‌లాడింది. ఎప్పుడూ బ‌క్క‌చిక్కి నీర‌సించిపోయే రూపాయి సైతం బ‌ల‌ప‌డింది.

మార్కెట్ సెంటిమెంట్ నేప‌థ్యంలో రిల‌య‌న్స్ షేర్లు భారీగా లాభ‌ప‌డ్డాయి. బుధ‌వారం ఒక్క‌రోజులో ఆర్ఐఎల్ షేర్లే 1.22 శాతం పెర‌గ‌టంతో ముకేశ్ ఆస్తి ఒక్క‌రోజులో రూ.3వేల కోట్ల (డాల‌ర్ల‌లో 466 మిలియ‌న్లు) కు పెరిగింది. దీంతో ముకేశ్ వ్య‌క్తిగ‌త సంప‌ద భారీగా పెరిగింది. మొత్తం 42.1 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ఆయ‌న ఆసియా కుబేరుడిగా అవ‌త‌రించారు. మ‌న రూపాయిల్లో చెప్పాలంటే ముకేశ్ ఆస్తి అక్ష‌రాలు రూ.2.7ల‌క్ష‌ల కోట్లుగా ఫోర్బ్ పేర్కొంది.

తాజా అంచ‌నాల‌తో ముకేశ్ ఆసియా కుబేరుడిగా అవ‌త‌రించ‌టంతో పాటు.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ స్థానంలో ఉన్న చైనా ఈవ‌ర్ గ్రాండ్ గ్రూపు ఛైర్మ‌న్ హు కా యాన్ ను బీట్ చేశారు. బుధ‌వారం నాటికి హు కా యాన్ ఆస్తులు 1.28 బిలియ‌న్ డాల‌ర్ల మేర త‌గ్గి 40.6 బిలియ‌న్ డాల‌ర్లుగా తేలింది. ఆయ‌న స్థానాన్ని ముకేశ్ అధిగ‌మించారు.

ఆసియా కుబేరుడిగా అవ‌త‌రించిన ముకేశ్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే 14వ అత్యంత సంప‌న్నుడిగా అవ‌త‌రించారు. ఇక‌.. ఎయిర్ టెల్ అధినేత సునీల్ భార‌తీ మిట్ట‌ల్ సైతం త‌న సంప‌ద‌న‌ను పెంచుకున్నారు. బుధ‌వారం నాటికి ఆయ‌న మొత్తం సంప‌ద విలువ రూ.70వేల కోట్లుగా లెక్క క‌ట్టారు. ప్ర‌పంచ ర్యాంకుల్లో భార‌త్ స్థానం మెరుగుప‌డ‌టం ఏమో కానీ.. రాత్రికి రాత్రే భారీ ఎత్తున మార్పులు జ‌రగ‌ట‌మే కాదు.. ఆసియా కుబేరుడిగా మ‌నోడు అవ‌త‌రించారు.