Begin typing your search above and press return to search.

తమ్ముడి కంపెనీని కొనుగోలు చేసిన ముఖేష్ అంబానీ..!

By:  Tupaki Desk   |   24 Dec 2022 1:30 AM GMT
తమ్ముడి కంపెనీని కొనుగోలు చేసిన ముఖేష్ అంబానీ..!
X
ధీరూబాయ్ వారసులుగా వ్యాపార రంగంలోకి ముఖేష్ అంబానీ.. అనిల్ అంబానీలు అడుగుపెట్టారు. వీరిద్దరు కూడా తండ్రి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరంతా జాయింట్ వ్యాపారం చేసినపుడు వ్యాపారం సజావుగానే సాగింది. అయితే అన్నదమ్ములు విడివిడిగా వ్యాపారం చేయాలని భావించి ఆస్తులు పంచుకున్నారు.

ఈ క్రమంలోనే ఎవరి వ్యాపారం వారు చేసుకుంటున్నారు. వీరిలో ముఖేష్ అంబానీ తన వ్యాపారాలన్నీ లాభాల బాట పట్టిస్తూ దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలుస్తున్నారు. మరోవైపు ఆయన తమ్ముడు ముఖేష్ అంబానీ మాత్రం తన కంపెనీలను ఒక్కొక్కటిగా దివాళా తీయిస్తూ అప్పుల ఊబిలో కురుకుపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే అనిల్ అంబానీ తనకు చెందిన పలు వ్యాపారాలను ఒక్కొక్కటిగా వదిలించుకునే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా తీవ్రంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన రిలయన్స్ ఇన్ఫ్రా టెల్ ను అనిల్ అంబానీ తాజాగా విక్రయించారు. దీనిని ముఖేష్ అంబానీ దక్కించుకోవడం విశేషం. దీంతో జియో అనుబంధ సంస్థల జాబితాలోకి రియలన్స్ ఇన్ఫ్రా టెల్ వచ్చి చేరింది.

అనిల్ అంబానీకి చెందిన టవర్స్ అండ్ ఫైబర్ ఆస్తుల వంద శాతం వాటాను 3వేల 720 కోట్లకు జియో సొంతం చేసుకుంది. ఈమేరకు జియో అనుబంధ సంస్థ డబ్బును ప్రత్యేక ఎస్బీఐ ఎస్క్రో అకౌంట్లోకి జమ చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే దేశ వ్యాప్తంగా రిలయన్స్ కు చెందిన 43వేల 540 మెుబైల్ టవర్లతో పాటు 1.78 లక్షల కి.మీ పొడవైన ఫైబర్ ఆస్తులన్నీ జియో వశమయ్యాయి.

మరోవైపు అనిల్ అంబానీకి చెందిన అనేక కంపెనీలు లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీటిని దక్కించుకునేందుకు చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్ నావల్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ వ్యాపారాన్ని కొనుగోలుకు హాజెల్-స్వాన్ కన్సార్టియం ప్రపోజ్ చేసిన ప్రణాళికను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంగీకరించింది.

దీనికి అహ్మదాబాద్ ప్రత్యేక బెంచ్ నేడు ఆమోదం తెలిపింది. కాగా జిందాల్ స్టీల్ అండ్ పవర్.. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దాఖలు చేసిన అప్పీళ్లను ట్రిబ్యునల్ తిరస్కరించింది. రిలయన్స్ నావల్‌కు చెందిన సుమారు 95శాతం రుణదాతలు అనుకూలంగా ఓటు వేయడంతో హాజెల్ మర్కంటైల్ కన్సార్టియం రిజల్యూషన్ ప్లాన్ ఇప్పటికే ఆమోదం పొందింది.

ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో రిలయన్స్ జియో జత కట్టింది. దీంతో ఐవోసీ పెట్రోల్ బంకులకు అవసరమైన నెట్‌వర్క్‌ సర్వీసుల నిర్వహణ రిలయన్స్ జియో చేతికి దక్కాయి. కంపెనీకి చెందిన 20 శాతం అంటే సుమారు 7 వేల 200 పెట్రోల్ బంకులకు అవసరమైన నిర్వహణ సేవలను రిలయన్స్ జియో అందించనుంది. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పెట్రోల్ స్టేషన్ల విషయంలో జరుగుతున్న అతిపెద్ద డీల్ కావడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.