Begin typing your search above and press return to search.

మోడీ హ‌ర్ట‌య్యాడ‌ని ఉద్యోగిని తొల‌గించిన ముఖేష్ అంబానీ

By:  Tupaki Desk   |   11 Jun 2021 4:30 PM GMT
మోడీ హ‌ర్ట‌య్యాడ‌ని ఉద్యోగిని తొల‌గించిన ముఖేష్ అంబానీ
X
గ‌త కొద్దికాలంగా సోష‌ల్ మీడియా కేంద్రంగా జ‌రుగుతున్న వ్య‌తిరేక ప్ర‌చారంపై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ఓ క‌న్నేసి ఉంచిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్ట‌ర్‌ను కేంద్ర ప్ర‌భుత్వం టార్గెట్ చేసింది. దీంతో ట్విట్ట‌ర్ సైతం జాగ్రత్త‌లు తీసుకుంటోంది. అయితే, ఈ ఎపిసోడ్‌లో ఓ కార్టూనిస్ట్ ఉద్యోగం ఊడింది.ట్విట్టర్‌ నుండి నోటీసులు వచ్చాయని పేర్కొంటూ ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్‌ మంజుల్‌ను ప్రముఖ వ్యాపార దిగ్గజం, అపర కుబేరుడు ముఖేష్‌ అంబానీ మీడియా సంస్థ 'నెట్‌వర్క్‌ 18' విధుల నుండి బహిష్కరించింది.

ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్‌ మంజుల్ ప‌లు సంద‌ర్భాల్లో కేంద్రం తీరును సునిశితంగా విశ్లేషిస్తూ కార్టూన్లూ వేశారు. అవి పెద్ద ఎత్తున వైర‌ల్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రం ఆయ‌న పేజీపై ట్విట్ట‌ర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో మీ పేజీపై చర్యలు తీసుకోవాలంటూ భారత్‌కు చెందిన ఉన్నతాధికారులు ఆదేశించారని పేర్కొంటూ ట్విట్టర్‌ మంజుల్‌కు నోటీసులు జారీ చేసింది. ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈ నెల 8న ఆయనను ఉద్యోగం నుండి నెట్‌వర్క్‌ 18 తొలగించడం గ‌మ‌నార్హం.

తన ఫ్రొఫెల్‌లో ట్విట్ట‌ర్‌ ఈ మెయిల్‌ను షేర్‌ చేసిన మంజుల్‌... దానికి 'జై హో మోడీజీ కి సర్కార్‌ కి (మోడీ ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసించాలి)' అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. అలాగే తాను చేసిన ఏ ట్వీట్‌ వల్ల సమస్య వచ్చిందో ప్రభుత్వం చెప్పి ఉంటే బాగుండేదని ఆయన చురక అంటించారు. మంజుల్‌ ఆరు సంవత్సరాలుగా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నెట్‌ వర్క్‌ 18లో పనిచేస్తున్నారు. మంజుల్‌కు ట్విట్టర్‌ నుండి వచ్చిన నోటీసుపై స్పందించిన విపక్ష నేతలు... మోడీ సర్కార్‌ నియంతృత్వ పోకడ అనుసరిస్తుందని మండిపడ్డారు. మ‌రోవైపు ఈ ఎపిసోడ్‌పై ట్విట్ట‌ర్ స్పందించింది. ప్రభుత్వం వద్ద నుండి వచ్చిన అభ్యర్థన కావడంతో తాము ఆ విషయాన్ని సదరు ఖాతాదారునికి తెలియజేస్తున్నామని, తాము ఎటువంటి చర్యలు ప్రారంభించడం లేదని పేర్కొంది.