Begin typing your search above and press return to search.

అంబానీ సంచ‌ల‌నం...అమెజాన్‌ ,ప్లిప్‌ కార్ట్‌ ల‌కు షాకిచ్చే స్కెచ్‌

By:  Tupaki Desk   |   20 Jan 2019 5:17 AM GMT
అంబానీ సంచ‌ల‌నం...అమెజాన్‌ ,ప్లిప్‌ కార్ట్‌ ల‌కు షాకిచ్చే స్కెచ్‌
X
భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం ముఖేష్ అంబానీ మ‌రో సంచ‌ల‌నం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టెలికం రంగాన్ని పూర్తిగా మార్చివేసిన ఆయ‌న సార‌థ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మ‌రో కొత్త ప్ర‌ణాళిక‌తో ముందుకు వ చ్చింది. రిటైల్ రంగంలో తనదైన ముద్ర వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్‌ లకు ధీటుగా రిటైల్ రంగాన్ని ఏలేందుకు సిద్దమవుతోంది. కొత్త ఈ కామ‌ర్స్ వేదిక‌ను సృష్టించేందుకు స‌న్న‌ద్ధ‌మైన అంబానీ త్వ‌ర‌లో వీటిని అమ‌ల్లో పెట్ట‌నున్నారు.

తొలుత పశ్చిమ భారతదేశంలోని 12 లక్షల మంది రిటైలర్లకు, స్టోర్స్ ఓనర్లకు ఒక షాపింగ్ ప్లాట్‌ ఫామ్‌ ను రూపొందించనుంది. జియో టెలికామ్ సేవలు, మొబైల్ పరికరాలు, దేశవ్యాప్తంగా రిటైల్ షోరూంలను కలిగివున్న రిలయన్స్ ప్రపంచంలోనే అతి పెద్ద రిటైలర్లను ఢీకొట్టాలనుకుంటోంది. గుజరాత్‌ లోని 12 లక్షల మంది చిన్న రిటైలర్లు, షాప్‌ కీపర్ల కోసం జియో, రిలయన్స్ రిటైల్ త్వరలోనే ఒక వినూత్న ఈ కామర్స్ ప్లాట్‌ ఫామ్‌ ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. అతి వేగంగా వృద్ధి చెందుతున్న జియోకు ప్రస్తుతం మొత్తం 28 కోట్ల సబ్‌ స్ర్కైబర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా 6500 నగరాలు, పట్టణాల్లో రిలయన్స్ రిటైల్‌ కు పది వేలకు పైగా రిటైల్ షోరూమ్‌ లు ఉన్నాయి. జియో యాప్ ద్వారా చిన్న రిటైలర్లందరినీ సంఘటితం చేయనున్నట్టు రిలయన్స్ రిటైల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వీ సుబ్రమణ్యం తెలిపారు. ఈ కామర్స్ ప్రణాళికలను త్వరలోనే ఒక్కటొక్కటిగా ముకేశ్ అంబానీ వెల్లడిస్తారని పేర్కొన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవల రిటైల్ రంగానికి సంబంధించి తీసుకువచ్చిన కొత్త నిబంధనలు అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్‌ లకు ప్రతికూలంగా ఉన్నాయి. దేశీయ కంపెనీలకు మేలు చేసేవిగా ఉండడంతో రిలయన్స్ రిటైల్‌ కు కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలో త‌న‌దైన మార్కెటింగ్ టెక్నిక్స్‌ తో ముఖేష్ అంబానీ ఈ రంగంలో అడుగిడితే, సంచ‌ల‌నాలు న‌మోద‌వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. జియోతో టెలికాం రంగాన్ని మార్చిన‌ట్లే... నూత‌న వేదిక ద్వారా రిటైల్ రంగాన్ని ముఖేష్ మార్చ‌నున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.