Begin typing your search above and press return to search.

ముకేశ్ అంబానీ ఆ ఘనతను సాధించేశారు.. క్యూ1లో అన్నేసి లాభాలా?

By:  Tupaki Desk   |   23 July 2022 4:17 AM GMT
ముకేశ్ అంబానీ ఆ ఘనతను సాధించేశారు.. క్యూ1లో అన్నేసి లాభాలా?
X
దేశంలోనే అత్యంత బడా కంపెనీ అయిన రిలయన్స్ కు నాయకత్వం వహిస్తూ.. మిగిలిన కంపెనీలకు భిన్నంగా నడిపిస్తారనే పేరున్న దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తాజాగా మరోసారి తన మార్కును ప్రదర్శించారు. ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో నికర లాభాల్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.

గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ సాధించిన లాభాలతో పోలిస్తే ఏకంగా 46 శాతం వృద్ధిని సాధించటం విశేషం. తాజా లాభాలతో ఆయన మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. పెట్రో కెమికల్ విభాగం కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ.1.6 లక్షల కోట్ల ఆదాయాన్ని సాధించటం రిలయన్స్ కే సాధ్యమైందని చెబుతున్నారు.

గత ఏడాది క్యూ1లో రూ.12,273 కోట్ల నికర లాభాన్ని సాధిస్తే.. తాజాగా రూ.17,955 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుంది. నిర్వహణ లాభం 46 శాతం ఉండటం సరికొత్త రికార్డుగా చెబుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీ పేరిట ఉన్న ముకేశ్ వ్యాపార సామ్రాజ్యాన్ని చూస్తే.. దేనికదే లాభాల బాట పట్టటమే కాదు.. వ్యాపారంలోనూ దూసుకెళుతున్న పరిస్థితి.

చమురు.. గ్యాస్ బిజినెస్ ఆదాయం 183 శాతం జంప్ చేయగా.. రిలయన్స్ రిటైల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో ఆ వ్యాపారంలోనే లాభాలే వచ్చాయి. కొత్తగా 792 స్టోర్లు ఓపెన్ చేసిన రిలయన్స్.. ఓటూసీ (ఆయిల్ టూ కెమికల్స్).. రిటైల్.. ఈకామర్స్.. టెలికంతోపాట న్యూ ఎనర్జీ బిజినెస్ లను నిర్వహిస్తోంది. మొత్తంగా ముకేశ్ ఏం చేసినా బంగారమే అన్న విషయం తాజాగా వెల్లడైన క్యూ1 ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.