Begin typing your search above and press return to search.

ముకేశ్ అంబానీతో చంద్రబాబు డీల్ ఏంటి?

By:  Tupaki Desk   |   13 Feb 2018 11:30 PM GMT
ముకేశ్ అంబానీతో చంద్రబాబు డీల్ ఏంటి?
X
ఏపీ రాజధాని అమరావతికి రిలయన్స్ దిగ్గజం ముకేశ్ అంబానీ రావడం... ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రియల్ టైం గవర్నెన్స్ ప్రాజెక్టును పరిశీలించడం తెలిసిందే. ఆ తరువాతే అసలు కథ మొదలైందంటున్నారు. అనంతరం చంద్రబాబు ఇంటికి ముకేశ్ భోజనానికి వెళ్లారు. అయితే.. ఈ విందు సమావేశం వెనుక ఎన్నో వ్యవహారాలున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముకేశ్ భార్య నీతూ అంబానీని టీటీడీ బోర్డులో కొనసాగించడం అనేది ఒకటి వినిపిస్తున్నా అది కేవలం డైవర్టింగ్ స్ర్టాటజీ అని తెలుస్తోంది. అసలు విషయం జియో డీల్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ ఒకటి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ.149కే టీవీ, ఫోన్, ఇంటర్నెట్ అన్నీ వచ్చేస్తాయి. ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. కానీ.. ఒకవేళ దీన్ని పక్కాగా రాష్ర్టమంతా అమలు చేస్తే జియో ఒక పెద్ద రాష్ట్రంలో దారుణంగా నష్టపోక తప్పదు. ఉచితం నుంచి పెయిడ్ సర్వీసులకు వచ్చి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు తిరిగి రాబట్టుకుంటున్న దశలో ఏ చిన్న నష్టాన్నికూడా భరించడానికి ముకేశ్ ఇష్టపడరు. అందులో భాగంగానే ఆయన ఫైబర్ నెట్ విషయం చంద్రబాబుతో మాట్లాడేందుకు వచ్చారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే... చంద్రబాబు, అంబానీల మధ్య డీల్ కుదిరితే ఇప్పటికే పడుతూలేస్తూ ఉన్న ఫైబర్ నెట్ ప్రాజెక్టు గంగలో కలిసిపోయినట్లే.

మరోవైపు టెక్నాలజీ పేరుతో రకరకాల ప్రయోగాలు చేస్తున్న ఏపీని బేస్ చేసుకుని రిలయన్స్ తన వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఈ భేటీ జరిగిందన్న మాటా ఒకటి వినిపిస్తోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సులను గవర్నెన్సులో అప్లయ్ చేసే ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వంతో వ్యాపారం పెంచుకునేందుకు ముకేశ్ వచ్చారని అంటున్నారు. ముకేశ్ తన సంతానాన్ని బిజినెస్లో ఇన్వాల్వ్ చేస్తుండడంతో మరింతగా విస్తరించే క్రమంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏఐ రంగాల్లో టెక్నికల్ సపోర్టు ఇచ్చేలా, పరికరాలు సరఫరా చేసేలా ఆలోచన చేస్తున్నారని.. అందులో భాగంగానే వచ్చారన్న వాదన ఒకటి వినిపిస్తోంది. ఏదేమైనా ఊరక రారు మహానుభావులు అన్నది మాత్రం నిజం.