Begin typing your search above and press return to search.

ముఖేశ్ అంబానీ 'రిలయన్స్' మరో ఘనతను సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   14 May 2022 3:29 AM GMT
ముఖేశ్ అంబానీ రిలయన్స్ మరో ఘనతను సొంతం చేసుకుంది
X
ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపర్చుకుంటూ తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్న కంపెనీగా ముకేశ్ అంబానీ ‘రిలయన్స్’ సంస్థ దూసుకెళుతోంది. వ్యాపారం అన్న తర్వాత అనుకూలతలు.. ప్రతికూలతలు ఉంటాయి. రిలయన్స్ విషయంలోనూ.. ముకేశ్ అంబానీ వరకు వస్తే మాత్రం అన్ని అనుకూలతలే తప్పించి.. ఎదురుదెబ్బలు అస్సలు కనిపించవు. క్యాలెండర్ లో రోజులు మారే కొద్దీ.. మరింత ముందుకు వెళ్లటమే ముకేశ్ అంబానీ విషయంలో కనిపిస్తుందని చెప్పాలి. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది.

తాజాగా ఫోర్బ్స్ వెలువరించిన తాజా గ్లోబల్ 2000లో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు ర్యాంకులను మెరుగుపర్చుకొని 53వ స్థానానికి చేరుకుంది. ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కంపెనీల్లో టాప్ 2000 జాబితాలో రిలయన్స్ స్థానం చూస్తే.. భారతీయులంతా గర్వ పడాల్సిందే.

కంపెనీ ఆస్తులు.. మార్కెట్ విలువ.. అమ్మకాలు.. లాభాలు ఇలా ప్రతి కీలక అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాలో దేశీయంగా ఉన్న 10 టాప్ కంపెనీల్లో రిలయన్స్ అగ్రస్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో 104.6 బిలియన్ల వార్షిక ఆదాయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ నమోదు చేసింది. అతి తక్కువ సమయంలో అత్యంత వేగంగా డెవలప్ అవుతున్నకంపెనీగా గౌతమ్ అదానీకి చెందిన కంపెనీలు నిలుస్తున్నాయి. ఇప్పటివరకు ఈ జాబితాలో చోటు దక్కించుకోని అదానీకి చెందిన సంస్థల్లో పలు కంపెనీలు తాజా జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

అదానీకి చెందిన పలు కంపెనీలు టాప్ 2000లో చోటు దక్కింది. అదానీ బొకేలో ఉన్న కంపెనీల్లో అదానీ ఎంటర్ ప్రైజస్ మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాతి స్థానంలో అదానీ పోర్ట్స్ నిలవగా.. తర్వాతి స్థానంలో అదానీ గ్రీన్ ఎనర్జీ నిలిచింది. 1988లో గౌతమ్ అదానీ ఒక కమొడిటీ ఎగుమతి కంపెనీని ఏర్పాటు చేశారు. కట్ చేస్తే.. 20 ఏళ్ల వ్యవధిలో ఆ సంస్థ 9.3 బిలియన్ డాలర్లతో తొలిసారి ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ఎక్కారు. ఇప్పుడు 90 బిలియన్ డాలర్లకు పైగా సంపదను సమకూర్చుకున్నారు. మొత్తంగా ఆదానీకి చెందిన కంపెనీల్లో తాజాగా టాప్ 2000లో చోటు దక్కించుకున్న కంపెనీల్ని చూస్తే..

అదానీ ఎంటర్ ప్రైజస్ 1453

అదానీ పోర్ట్స్ 1568

అదానీ గ్రీన్ ఎనర్జీ 1570

అదానీ ట్రాన్స్ మిషన్ 1705

అదానీ టోటల్ గ్యాస్ 1746

ఇదిలా ఉంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత మరో తొమ్మిది కంపెనీలు టాప్ 500లో నిలిచాయి. ఆయా కంపెనీలు.. వాటికి లభించిన ర్యాంకులు చూస్తే..

రిలయన్స్ ఇండస్ట్రీస్ 53

ఎస్ బీఐ 105

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు 153

ఐసీఐసీఐ బ్యాంక్ 204

ఓఎన్ జీసీ 228

హెచ్ డీఎఫ్ సీ 268

ఐఓసీ 357

టీసీఎస్ 384

టాటా స్టీల్ 407

యాక్సిస్ బ్యాంక్ 431