Begin typing your search above and press return to search.

మోదీ ధైర్యాన్ని క్యాష్ చేసుకుంటున్న అంబానీ!

By:  Tupaki Desk   |   12 Aug 2019 2:38 PM GMT
మోదీ ధైర్యాన్ని క్యాష్ చేసుకుంటున్న అంబానీ!
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న రీతిలో జమ్ముకశ్మీర్‌ కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ రెండు ముక్కలైంది. ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రత్యేక ప్రతిపత్తి.. 370వ అధికరణం రద్దుతో అంతమైంది. దానిలో భాగంగా ఉన్న 35- ఏ ఉనికి కోల్పోయింది. జమ్ముకశ్మీర్ అనుభవిస్తున్న ప్రత్యేక అధికారాలన్నీ రద్దయిపోయాయి. ఇక కశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయి.. అఖండ భారతదేశంలో ఒక భాగంగా మారిపోయింది. ఈ నిర్ణ‌యాన్ని ప‌లు పార్టీలు విబేధించ‌గా...అనేక పార్టీలు మ‌ద్ద‌తిచ్చాయి. జమ్ముకశ్మీర్‌ కు 370వ అధికరణం రద్దుతోపాటు జమ్ముకశ్మీర్ - లడఖ్‌ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని లడఖ్ వాసులు స్వాగతించారు.

అయితే, ఇలా వివిధ ర‌కాలైన ప‌రిణామాలు ఉండ‌గా...విదేశాలు త‌మదైన శైలిలో స్పందిస్తుండ‌గా...ప్ర‌ధాని మోదీ తీసుకున్న దైర్య‌వంత‌మైన‌ నిర్ణ‌యాన్ని మొద‌టగా రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ క్యాష్ చేసుకున్నారు. ముంబైలో జరిగిన రిలయెన్స్ యాన్యువల్ జనరల్‌ సమావేశంలో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కీల‌క విషయాన్ని స్వయంగా ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌ - లడఖ్‌ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ రెడీ అయింద‌న్నారు. సమీప భవిష్యత్తులో జమ్మూకశ్మీర్‌ - లడఖ్‌ లో పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వస్తుందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌ - లడఖ్‌ ప్రజల అభివృద్ధి అవసరాలకు తాము మద్దతుగా ఉంటామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటంబాల బాధ్యతను తీసుకున్నట్లు ఈ సందర్భంగా అంబానీ ప్రకటించారు. అమర జవాన్ల పిల్లల విద్యకు సంబంధించి, అలాగే వారి కుటుంబాల జీవనభృతికి సంబంధించి తాము పూర్తి బాధ్యత తీసుకున్నట్లు ప్రకటించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ముఖేష్ అభినందించ‌డం విశేషం. భార‌త్‌ - సౌదీ మ‌ధ్య వాణిజ్య బంధాల‌కు ప్ర‌ధాని మోదీ - ప్రిన్స్ స‌ల్మాన్‌ లు బ‌ల‌మైన పునాది వేశార‌ని ముకేశ్ అన్నారు. సౌదీకి చెందిన ఆరామ్‌కో సంస్థ .. రిలయ‌న్స్ ఓటీసీ సంస్థ‌లో సుమారు 75 బిలియ‌న్ల డాల‌ర్లు పెట్టుబ‌డి పెట్ట‌నుందని ముఖేష్ ప్ర‌క‌టించారు. ఈ మొత్తం మ‌న క‌రెన్సీలో సుమారు 5.3 ల‌క్ష‌ల కోట్లు అన్న‌మాట‌. ఇది ఆ రిల‌య‌న్స్ కంపెనీలో 20 శాతం వాటా. ఆయిల్‌ - పెట్రో కెమిక‌ల్ వ్యాపారంలో సంయుక్తంగా ముందుకు వెళ్లేందుకు సౌదీ ఆరామ్‌ కోతో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు ముకేశ్ చెప్పారు. ఈ ఒప్పందం ప్ర‌కారం సౌదీ కంపెనీ రిల‌య‌న్స్ పెట్రో కెమిక‌ల్స్‌ కు 500 బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ ను ప్ర‌తి రోజు స‌ర‌ఫ‌రా చేస్తుంది. జామ్‌ న‌గ‌ర్‌ లో ఉన్న రిఫైన‌రీకు ఈ స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంది. ఆరామ్‌ కోకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిర్ ఎక్స్‌ పోర్ట‌ర్ అన్న పేరుంది.