Begin typing your search above and press return to search.

విష‌మంగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం!

By:  Tupaki Desk   |   15 July 2019 4:20 AM GMT
విష‌మంగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం!
X
దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెబుతున్నారు. ఆయ‌న గ‌డిచిన కొద్ది నెల‌లుగా కేన్స‌ర్ తో బాధ ప‌డుతున్నారు. 2004లో వైఎస్ ముఖ్య‌మంత్రి అయ్యాక త‌న కేబినెట్ లోకి ముఖేష్ గౌడ్ ను తీసుకోవ‌టం ద్వారా ఆయ‌న తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుల‌య్యారు.

అంత‌కు ముందు వ‌ర‌కూ హైద‌రాబాదీయుల‌కు తెలిసిన ఆయ‌న‌.. త‌ర్వాతి కాలంలో ఇప్ప‌టిరెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ ప్ర‌ముఖుడిగా నిలిచారు. ముఖ్యంగా హైద‌రాబాద్ పేరు ప్రస్తావించిన‌ప్పుడు.. భాగ్య‌న‌గ‌ర రాజ‌కీయాల్ని చ‌ర్చించిన‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా ముఖేష్ పేరు వ‌చ్చేది.

మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ కు అత్యంత స‌న్నిహితుడైన ముఖేష్ ను.. అంద‌రూ హైద‌రాబాద్ బ్ర‌ద‌ర్స్ గా అభివ‌ర్ణిస్తుంటారు. రాష్ట్ర విభ‌జ‌న వేళ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన ముఖేష్ కొంత నిరాశ‌కు గురైనా.. 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న‌.. తాను త‌ప్ప‌నిస‌రిగా గెలుస్తాన‌న్న ధీమాను వ్య‌క్తం చేసేవారు.

అలాంటి ఆయ‌న ఓట‌మిపాలు కావ‌టాన్ని జీర్ణించుకోలేక‌పోయార‌ని చెబుతారు. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఒక్క‌సారిగా ఆయ‌న ఆరోగ్యం దెబ్బ తిన్న‌ట్లు ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు. ఓట‌మి ఆయ‌న్ను కుంగ‌దీసింద‌ని.. అప్ప‌టికే అనారోగ్యంగా ఉన్న ఆయ‌న హెల్త్‌.. మ‌రింతగా దెబ్బ తింద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ముఖేష్ బ‌య‌ట‌కు పెద్ద‌గా రాలేదు.

గ‌డిచిన‌కొద్ది రోజులుగా అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ముఖేష్ ఆరోగ్య ప‌రిస్థితి తాజాగా మ‌రింత‌గా విష‌మించింద‌ని చెబుతున్నారు. వైద్యులు చేస్తున్న చికిత్స‌కు ఆయ‌న శ‌రీరం స‌హ‌క‌రించం లేద‌ని.. స్పందించ‌టం ఆగింద‌ని తెలుస్తోంది. దీంతో.. ఆయ‌న‌కు చికిత్స‌ను నిలిపివేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఒక‌ప్పుడు రాజ‌కీయంగా ఒక వెలుగు వెలిగిన ముఖేష్.. చివ‌ర్లో మాత్రం తాను కోరుకున్న ఎమ్మెల్యే ప‌ద‌విని చేజిక్కించుకోలేక‌పోవ‌టం గ‌మ‌నార్హం.