Begin typing your search above and press return to search.

నిన్నటి వరకు ముసలం.. నేడు కుశలం

By:  Tupaki Desk   |   3 Nov 2016 8:52 AM GMT
నిన్నటి వరకు ముసలం.. నేడు కుశలం
X
ఉత్తర్ ప్రదేశ్ లో ములాయం ఇంట్లో పుట్టిన ముసలం కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. ఎన్నో పరిణామాలు.. ఎత్తులు పైఎత్తులు - అలకలు - ఆగ్రహాల తరువాత ఈ రోజు భిన్నధ్రువాలన్నీ ఒక్కచోట చేరి ముఖ్యమంత్రి అఖిలేశ్ ప్రారంభించిన వికాస్ యాత్రలో చేయిచేయి కలిపాయి. శాశ్వతంగా పరిష్కరించుకున్నారో లేదంటో తాత్కాలికంగా పక్కన పెట్టారో కానీ విభేదాలను తండ్రీకొడుకులు ములాయం - అఖిలేశ్ లు.. ములాయం తమ్ముడు - అఖిలేశ్ బాబాయి అయిన వివాదాల్లో కీలకంగా ఉన్న శివపాల్ యాదవ్.. అంతా కలిసి యాత్రలో పాల్గొన్నారు. యాత్ర సందర్భంగా అఖిలేశ్ - శివపాల్ వర్గాలు దారుణంగా కొట్టుకున్నా కూడా ఈ ఇద్దరు నేతలు ఉద్రేక పడకుండా చిన్నవిషయంగా కొట్టిపడేశారు. తమతమ అనుచరులకు సర్చిచెప్పారు.

లక్నోలోని లా మార్టినల్ స్కూల్లో రథయాత్రకు ములాయం స్వయంగా పచ్చజెండా ఊపారు. కాగా - ప్రజల్లో తనకున్న బలాన్ని నిరూపించుకునేందుకు ఈ యాత్రను వాడుకోవాలని అఖిలేష్ ప్రయత్నిస్తుండగా.. అఖిలేశ్ పిలిచినా వెళ్లకపోతే మొదటికే మోసం వస్తుందన్న ఉద్దేశంతో అన్నాదమ్ములు ములాయం - శివపాల్ లు వెళ్లినట్లు చెబుతున్నారు.

కాగా ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ రథాయాత్రలో ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. యాత్రలో అఖిలేశ్ ప్రయాణించే ఆధునిక బస్సు కిలోమీటరు దూరమైనా వెళ్లకముందే ఆగిపోయింది. దాంతో అఖిలేశ్ కారులో యాత్ర సాగించాల్సి వచ్చింది. నిజానికి యాత్ర సాగినంత కాలం అఖిలేశ్ ఇందులోనే ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశారు. జనాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సి వచ్చేటప్పుడు బస్సులోంచి అఖిలేశ్ ను పైకి లేపేలా హైడ్రాలిక్ ఏర్పాట్లూ ఉన్నాయి. బస్సులోంచి బయట మొత్తం చూసేలా సీసీటీవీ కెమేరాలు - సోఫాలు - బెడ్ - టాయిలెట్లు వంటి అన్ని సదుపాయాలూ ఉన్నాయి. అయితే... యాత్ర ప్రారంభమైన అయిదు నిమిషాల్లోనే బ్రేక్ డౌన్ కావడంతో దానికి ఇప్పుడు మరమ్మతులు చేస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/