Begin typing your search above and press return to search.

మీటింగ్ పెట్టే ధైర్యం కూడా నేతాజీకి లేదా?

By:  Tupaki Desk   |   2 Jan 2017 8:14 AM GMT
మీటింగ్ పెట్టే ధైర్యం కూడా నేతాజీకి లేదా?
X
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారపక్షానికి చెందిన అంతర్గత రాజకీయాలు అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబంలో మొదలైన లుకలుకలు చివరకు పార్టీ చీలిక వరకూ వెళ్లటమే కాదు.. తండ్రీ.. కొడుకుల మధ్య బహిరంగ పోరు వరకూ దిగజారిన పరిస్థితి. నిన్నమొన్నటి వరకూ తండ్రి ఏం చెప్పినా.. సరేననంటూ బుద్దిగా తలూపినట్లు కనిపించిన కొడుకు అఖిలేశ్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా నాన్నతో సై.. అంటే సై అన్నట్లుగా ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ.. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న తండ్రికి చుక్కలు చూపిస్తున్నారు.

నిన్నటి వరకూ సమాజ్ వాదీకి చీఫ్ గా వ్యవహరిస్తున్న తన తండ్రి పోస్ట్ ను పీకి పారేసి.. తానే చీఫ్ గా ప్రకటించుకున్న అఖిలేశ్.. ఇప్పుడు తండ్రి పార్టీ తనదని.. పార్టీ గుర్తు ‘సైకిల్’ కూడా తన సొంతమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కొడుకు దూకుడుకు కళ్లెం వేయటంతో పాటు.. సమాజ్ వాదీ పార్టీ మొత్తం తన చుట్టూనే ఉందన్న విషయాన్ని చాటి చెప్పేందుకు వీలుగా.. ఈ నెల 5న పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సమావేశానికి సమాజ్ వాదీ పార్టీ నేతల్ని భారీ ఎత్తున కూడగట్టాలని ములాయం తొలుత భావించారు. అయితే.. ప్రస్తుతం పార్టీలో తన పట్టు తగ్గిపోయిందని.. కుర్రాడైన తన కొడుకు చుట్టూనే నేతలు ఉన్నారన్న విషయం ములాయంకు అర్థమైంది. అందుకే.. నేతాజీగా తనకిచ్చిన గౌరవ మర్యాదలన్నీ.. తన వయసుకే కానీ.. తన రాజకీయ చతురత చూసి కాదన్న వాస్తవాన్ని ములాయం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది.

అందుకే కాబోలు..ఈ నెల 5న తాను నిర్వహిస్తానని చెప్పిన పార్టీ సమావేశాన్ని క్యాన్సిల్ చేసినట్లుగా తాజాగా ప్రకటించారు. మీటింగ్ కానీ పెడితే.. నేతలు పెద్దగా ఎవరూ రాన్న సమాచారంతోనే ఆయన కాస్తంత వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. అధికారపార్టీని చీఫ్ గా ఒక వెలుగు వెలిగిన నేతాజీకి.. తాజాగా ఎదురైన పరిస్థితులు చూసిన పలువురు.. పెద్దమనిషికి పెద్ద కష్టమే వచ్చిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/