Begin typing your search above and press return to search.

రాష్ట్రప‌తిగా ములాయం సింగ్ యాద‌వ్‌!

By:  Tupaki Desk   |   5 April 2017 7:48 AM GMT
రాష్ట్రప‌తిగా ములాయం సింగ్ యాద‌వ్‌!
X
భార‌త రాష్ట్రప‌తి ప‌ద‌వి ఎంపికలో అనూహ్య‌మైన పేర్లు ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తున్నాయి. ఈ జూన్‌ లో రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఉత్తరప్రదేశ్ - ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంతో పై ఉన్నత పదవులకు అభ్యర్థులపై ఏకాభిప్రాయ సాధన లేదా ఎన్నికలకు ప్రతిపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం ప్రధాని మోడీకి తప్పింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ (ఎంపిలు - ఎమ్మెల్యేలు)లో బీజేపీకి కొద్దిపాటి తగ్గుదల మాత్రమే ఉంది. దాదాపు పాతికమంది తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు - నేతలు కెమెరాముందు లంచాలు పుచ్చుకున్న ‘నారద’ స్టింగ్ ఆపరేషన్‌ పై సిబిఐ దర్యాప్తుకు ఆదేశం తదుపరి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని బలపరుస్తామని (అభ్యర్థి ఎవరో తెలియక పోయినా) ప్రకటించి ఆయనకు తలవంచారు. ఇది మోడీకి కలసివచ్చే అదనపు అంశం. రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి అభ్యర్థులను తనకుతానుగా నిర్ణయించే స్థితిలో ఉన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఆయన ఇంతవరకు గుంభనగా ఉన్నారు. అయితే స్వపక్షాన్ని - ప్రతిపక్షాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయం చేయవచ్చని భావిస్తున్నారు.

అయితే రాష్ట్రప‌తి అభ్యర్థులపై కొన్ని ఊహాగానాలు రాజధానిలో షికారు చేస్తున్నాయి. బాబ్రీమసీదు కూల్చివేతలో క్రిమినల్ కుట్రకేసు ఇటీవల మళ్లీ తెరపైకి రావటంతో, పార్టీ సీనియర్లు ఎల్‌ కే అద్వానీ - మురళీమనోహర్ జోషీలకు సీబీఐ నుంచి క్లీన్‌ చిట్ లభిస్తే తప్ప వారిలో ఏ ఒక్కరూ అభ్యర్థులయ్యే అవకాశం లేదు. ఉపరాష్ట్రపతిగా కల్యాణ్‌ సింగ్ పరిస్థితీ అంతే. మోడీ దూరదృష్టితో కొత్తరకం ఆలోచనలు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ సందర్భంగా దళితనేత జగ్‌ జీవన్‌ రాం కుమార్తె - మాజీ స్పీకర్ మీరాకుమార్ - ఓబీసీ నేత సమాజ్‌ వాదిపార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఓబీసీ అభ్యర్థి ఎవరూ ఇంతవరకూ రాష్ట్రపతి పదవిని అలంకరించలేదు. ములాయంసింగ్‌ ను గనుక మోడీ ఎంచుకునే పక్షంలో స్వయంగా ఓబీసీ అయిన ఆయన ఆ సామాజిక తరగతులకు తిరుగులేని నాయకుడవుతాడు. ములాయంసింగ్ రాష్ట్రపతి పదవిని ఆశించే కొంతకాలంగా ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌ వాది పార్టీలో అంతఃకలహాలు బీజేపీకి మేలు చేసే ఉద్దేశంతో ములాయం సృష్టించినవేనన్న అనుమానాలు లేకపోలేదు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ప్రమాణ స్వీకారోత్సవంలో వేదికమీద ప్రధానికి కొద్దిదూరంలో కూర్చున్న ములాయంసింగ్ హుషారుగా కనిపించారు. అయితే మోడీని పొగిడినంత మాత్రాన ములాయంసింగ్ సైద్ధాంతిక, రాజకీయ వ్యత్యాసాలను అధిగమించి రాష్ట్రపతి కుర్చీని చేరుకోవటం సందేహమే.

మ‌రోవైపు ప్రస్తుతం మణిపూర్ గవర్నర్‌ గా ఉన్న నజ్మా హెప్తుల్లా రాష్ట్రపతి లేదా ఉప రాష్ట్రపతి పదవికి ఆశపడుతున్నారు. ఆమె కాంగ్రెస్‌ లో ఉన్నప్పుడే రాష్ట్రపతి పదవి ఆశించారు. ఇటీవల మణిపూర్‌ లో బీజేపీ ప్రభుత్వాన్ని అందల మెక్కించటంలో ఆమె సహాయపడ్డారు. అప్పుడు ఆమెకు ఉపరాష్ట్రపతి పదవి హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. బీజేపీకి మెజారిటీ ఉన్నప్పటికీ ప్రతిపక్షాలతో కూడా చర్చించి స్థూల ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయటం సుహృద్భావం నింపుతుంది. ఈనెల మూడవవారంలో ఒడిసాలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ అంశం స్థూలంగా చర్చకు రావచ్చని భావించబడుతున్నది. దీర్ఘకాల రాజకీయ ప్రయోజనాలు మోడీ ఆలోచనను ప్రభావితం చేసే అవకాశముంది. అందువల్ల, అనూహ్యంగా కొత్తపేర్లు రావచ్చు. ఏమైనా ఆర్‌ఎస్‌ఎస్‌తో ఏకాభిప్రాయ సాధన మోడీకి ముఖ్యం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/