Begin typing your search above and press return to search.

ములాయంకు అఖిలేశే గతి

By:  Tupaki Desk   |   4 Nov 2016 9:58 AM GMT
ములాయంకు అఖిలేశే గతి
X
కొడుకుతోనే సిగపట్లకు దిగుతున్న సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు అనుకోని దెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాకూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఆయనకు మిత్రపక్షాలు భారీ షాకిచ్చాయి. అఖిలేశ్ యాదవ్ ను సీఎం అభ్యర్థిగా పెడితేనే చేతులు కలుపుతామని వారంతా తెగేసి చెప్పేశారు. దీంతో కొడుకును కాదని ఏమీ చేయలేని పరిస్థితి ములాయంకు ఎదురవుతోంది.

పార్టీలో ముసలం రేగడంతో ములాయం.. కొడుకుని వ్యతిరేకిస్తూ సోదరుడు శివపాల్ యాదవ్ - ప్రాణమిత్రుడు అమర్ సింగ్ లను నమ్మారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయ మహాకూటమి ఏర్పాటు చేయాలని భావించి పలు పార్టీలను సంప్రదించగా వారంతా అఖిలేశ్ ను సీఎం కేండిడేట్ గా ప్రకటించాలని సూచించినట్లు తెలుస్తోంది. సమాజ్ వాదీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా అఖిలేశ్ పేరును ఖరారు చేస్తేనే ఉమ్మడి పోరుకు అంగీకరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి. ములాయం మహాకూటమి ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా తన కుటుంబంలో రేగిన కలహాలను పరిష్కరించుకోవాలని ఆర్ ఎల్డీ అధినేత అజిత్ సింగ్ సూచించారు.

కాగా, సమాజ్ వాదీ పార్టీ - బీఎస్పీ కలిసి వస్తేనే మహాకూటమి సాధ్యమన్న అభిప్రాయాన్ని జేడీ(యూ) నేత - బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యక్తం చేశారు. గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికప్పుడు మహాకూటమి నుంచి చివరి నిమిషంలో ములాయం తప్పుకుని నితీశ్ కు షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ములాయంతో చేతులు కలిపే విషయంలో నితీశ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ములాయం ఇంట్లో ముసలం అఖిలేశ్ కే బాగా కలిసొచ్చినట్లుగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/