Begin typing your search above and press return to search.

రేణుక కొత్తపాఠాలు చదివారా?

By:  Tupaki Desk   |   29 Aug 2016 5:12 AM GMT
రేణుక కొత్తపాఠాలు చదివారా?
X
పిల్లల పుస్తకాల్లో అ అంటే అమ్మ - ఆ అంటే ఆవు అని తెలుగు మీడియం లోనూ - ఏ అంటే యాపిల్ - బీ అంటే బాల్ - సీ అంటే క్యాట్ అని ఉంటుంది. అయితే ఇదంతా గతం అని, అది పాత విషయమని ఇప్పుడు కొత్తగా కొత్త పదాలు - కొత్త పాఠాలు వస్తున్నాయని - ప్రజలు కూడా అలానే భావిస్తున్నారని చెప్పుకొచ్చారు టీడీపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక. నాయకుడిపై అభిమానమో - లేక అభిమానానికి పారాకాష్టో తెలియదు కానీ... చంద్రబాబుపైనా - ఏపీలో జరుగుతుందని చెబుతున్న అభివృద్ధిపైనా రేణుక కొత్తగా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అవసరం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ - కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భావిస్తున్నారా? వారికి రాజధాని అవసరం లేదా అని ప్రశ్నిస్తూ మొదలుపెట్టిన ముళ్లపూడి రేణుక.. ఎంతో వేగంగా - త్వరితగతిన జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం ఏమాత్రం సమంజసమనిపించుకోదని చెబుతున్నారు. ఏపీలో అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుందని - దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని ఆమె ప్రతిపక్ష పార్టీలకు సూచిస్తున్నారు.

అనంతరం.. నాడు చదువుకునే రోజుల్లో.. ఆ అంటే అమ్మ అని - ఆ అంటే ఆవు అని ఉండేదని.. ఇప్పుడు మాత్రం అ అంటే అమరావతి - ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని స్కూళ్లలో చెబుతున్నారని చెప్పిన రేణుక.. ఇంగ్లిష్ మీడియంలో కూడా పాఠాలు మారిపోతున్నాయని అవి.. ఏ అంటే ఆంధ్రప్రదేశ్ - బీ అంటే బాబు - సీ అంటే క్యాపిటల్‌ - డీ అంటే డెవల్‌ప్ మెంట్‌ అని చెప్పుకొంటున్నారని కొత్త నిర్వచనాలిచ్చారు. కాగా, వాస్తవం ఎలా ఉన్నా.. వినడానికి మాత్రం సరదాగా ఉన్నాయని ఈ కొత్త నిర్వచనాలపై పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.