Begin typing your search above and press return to search.

ప్రజ్ఞాకు మించి పోయిన మ‌హిళా ఐఏఎస్ ట్వీట్‌!

By:  Tupaki Desk   |   3 Jun 2019 4:33 AM GMT
ప్రజ్ఞాకు మించి పోయిన మ‌హిళా ఐఏఎస్ ట్వీట్‌!
X
ఏ ప్ర‌జాస్వామ్య దేశానికి లేని తెగులు భార‌త్ కు ఉంద‌న్న విమ‌ర్శ‌కుల మాట‌ను నిజం చేసే ఉదంతాలు త‌ర‌చూ చోటు చేసుకుంటున్నాయి. ఏ దేశంలో అయినా ఎవ‌రికి విలువ ఇచ్చినా.. ఇవ్వ‌కున్నా జాతిపిత‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడే సాహ‌సం చేయ‌రు. కానీ.. మితిమీరిన భావ‌స్వేచ్ఛ బ‌రితెగింపును అంత‌కంత‌కూ పెంచేస్తోంది. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం మ‌హాత్మ గాంధీని చంపేసిన గాడ్సేను పొగిడేసిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సంచ‌ల‌నం సృష్టించ‌టం తెలిసిందే.

ఆమె చేసిన వ్యాఖ్య‌ల్ని ప్ర‌ధాని మోడీ సైతం త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. ఆమెను తానెప్ప‌టికి క్ష‌మించ‌నని తేల్చేశారు. ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా ఆమెను బంప‌ర్ మెజార్టీతో ఎంపీగా గెలిచేలా చేసిన భోపాల్ ప్ర‌జ‌ల‌ను ఏమ‌ని చెప్పాలి. త‌ప్పు చేసినోళ్లు ఎలాంటోళ్లైనా స‌రే.. వారికి త‌గిన శాస్తి జ‌రిగేలా వ్య‌వ‌హ‌రించాల్సిన ప్ర‌జ‌లు.. అందుకు భిన్నంగా ప‌వ‌ర్ చేతికి ఇవ్వ‌టం దేనికి నిద‌ర్శ‌నం.

మ‌హాత్మ‌ను హ‌త్య చేసిన గాడ్సేను ప్రజ్ఞ పొగిడేయ‌టం.. దానికి జ‌ర‌గాల్సిన శాస్తి జ‌ర‌గ‌క‌పోవ‌టంతో మ‌రో కీల‌క అధికారిణికి కొత్త ఆలోచ‌న‌లు వ‌చ్చేలా చేసిన‌ట్లుంది. తాజాగా ముంబ‌యికి చెందిన ఐఏఎస్ అధికారిణి ఒక‌రు గాడ్సేకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.

ముంబ‌యికి చెందిన బీఎంసీ డిప్యూటీ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న నిధి చౌద‌రి ఈ వ్యాఖ్య‌ల్ని చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌టం.. ఒత్తిళ్లు పెరిగిపోవ‌టంతో తాను చేసిన పోస్ట్ కు కొత్త అర్థం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. తాను కేవ‌లం వ్యంగ్యంగానే ఈ వ్యాఖ్య చేశాన‌ని.. అంద‌రూ త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నారంటూ ఆమె తాను చేసిన ట్వీట్ ను తొల‌గించారు.

ఒక బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉంటూ.. ట్వీట్ చేసిన వైనంపై రాజ‌కీయ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. ఈ తీరు స‌రికాద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. తాజాగా మ‌హిళా ఐఏఎస్ అధికారిణి మాట‌ల నేప‌థ్యంలో ఆమెపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాంగ్రెస్‌.. ఎన్సీపీలు డిమాండ్ చేస్తున్నాయి. మ‌రి.. మ‌హారాష్ట్ర బీజేపీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.