Begin typing your search above and press return to search.

'బ్లూవేల్' ఆడుతూ బాలుడి ఆత్మ‌హ‌త్య!

By:  Tupaki Desk   |   31 July 2017 5:30 PM GMT
బ్లూవేల్ ఆడుతూ బాలుడి ఆత్మ‌హ‌త్య!
X
ప్ర‌స్తుతం యువ‌త‌రం ఆన్ లైన్ గేమ్ ల ప‌ట్ల ఎక్కువ మోజును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆ మోజుకు క్యాష్ చేసుకునేందుకు ర‌క‌ర‌కాల గేమ్స్ ను నిర్వాహ‌కులు డిజైన్ చేస్తున్నారు. పోకెమాన్ గో ఆన్ లైన్ వ‌ర్చువ‌ల్ రియాల్టీ గేమ్ ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో కొద్ది రోజుల క్రితం ర‌ష్యాలో బ్లూవేల్ ఆన్ లైన్ గేమ్ సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. బ్లూవేల్‌.. ఓ అండర్‌ గ్రౌండ్‌ ఆన్‌ లైన్‌ గేమ్‌. ఈ గేమ్‌ లో మొత్తం 50 టాస్క్‌లు ఉంటాయి. ప్రతీ టాస్క్‌ని పూర్తిచేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు తీసి పోస్ట్‌ చేస్తుండాలి. న్యూడ్ ఫొటోలు షేర్ చేయ‌డం వంటి అస‌భ్య‌క‌ర‌మైన టాస్క్ లు కూడా ఈ గేమ్ లో భాగ‌మే.

ఈ గేమ్ లో భాగంగా కొంత‌మందిని ఆత్మహ‌త్య చేసుకోవాల‌ని కూడా నిర్వాహ‌కులు ప్రేరేపిస్తుంటారు. ఒక‌సారి ఈ గేమ్ ఆడ‌డం మొద‌లుపెట్టాక వెన‌క్కు రాలేని స్థితిలోకి పార్టిసిపెంట్లు వెళ్లిపోతారు. పార్టిసిపెంట్ల‌ను మాన‌సికంగా లోబ‌రుచుకోవ‌డ‌మే ఈ గేమ్ ఉద్దేశం. ర‌ష్యాలో ఈ గేమ్ ఆడుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోతుండ‌డంతో దీనిని నిర్వహించే వ్యక్తిని రష్యా పోలీసులు గ‌తంలో అరెస్టు చేశారు. ఈ పైశాచిక ఆన్ లైన్ గేమ్‌ ఆడుతూ వివిధ దేశాల్లో చాలామంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే, తొలిసారిగా భారత్‌ లో ఈ గేమ్ ఆడుతూ ఓ బాలుడు మ‌ర‌ణించడం సంచ‌ల‌నం రేపుతోంది. దేశంలో ఇటువంటి ఘటన జ‌ర‌గడం ఇదే మొదటిసారి.

ముంబయిలోని అంధేరీ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం ‘బ్లూవేల్‌’ ఆన్‌ లైన్‌ గేమ్‌ ఆడుతూ కూర్చున్నాడు. ఆ స‌మ‌యంలో ....భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఓ టాస్క్ అత‌డికి వ‌చ్చింది. దీంతో, ఏ మాత్రం ఆలోచించ‌కుంఆ నాలుగు అంతస్తుల భవనంపై నుంచి కిందికి దూకేశాడు. తలకు తీవ్ర‌మైన‌ గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. బాలుడు గేమ్‌ ఆడుతూ చనిపోయాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు అన్నారు. పూర్తిగా విచారణ జరిపి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు వెల్ల‌డిస్తామ‌న్నారు. తమ కుమారుడు పైలట్‌ కావాలని క‌ల‌లు క‌నేవాడ‌ని, రష్యాకి వెళ్లి పైలట్‌ ట్రైనింగ్‌ తీసుకుంటానని అంటుండేవాడని తల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు.