Begin typing your search above and press return to search.

జెట్ ఎయిర్ వేస్ హైజాక్ నాట‌కం ఆమె కోస‌మేన‌ట‌

By:  Tupaki Desk   |   31 Oct 2017 6:39 AM GMT
జెట్ ఎయిర్ వేస్ హైజాక్ నాట‌కం ఆమె కోస‌మేన‌ట‌
X
నిన్న తెల్ల‌వారుజామున ముంబ‌యి నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానం హైజాక్ బెదిరింపుల నేప‌థ్యంలో అత్య‌వ‌స‌రంగా ఆహ్మాదాబాద్‌కు త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. తెల్ల‌వారుజామున 2.55 గంట‌ల స‌మ‌యంలో ముంబ‌యి నుంచి బ‌య‌లుదేరిన విమానంలోని టాయిలెట్ లో విమానం హైజాక్ బెదిరింపు లేఖ క‌నిపించింది.

విమానాన్ని హైజాక్ చేశామ‌ని.. తాము విమానంలోనే ఉన్నామ‌ని.. విమానాన్ని ఢిల్లీలో ల్యాండ్ చేయొద్ద‌ని.. పాక్ అక్ర‌మిత కశ్మీర్ కు తీసుకెళ్లాల‌ని.. ఒక‌వేళ అలా చేయ‌కుంటే విమానాన్ని పేల్చేస్తామ‌ని బెదిరింపుల‌తో లేఖ రాశారు. ఇందుకు సంబంధించి తాము విమాన కార్గో ఏరియాలో బాంబులు పెట్టిన‌ట్లుగా వెల్ల‌డించాడు. ఈ లేఖ‌ను గుర్తించిన జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు.

వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన విమాన‌సిబ్బంది అత్య‌వ‌స‌ర సాయం కోసం హైజాక్డ్ బ‌ట‌న్ నొక్కారు. అప్ప‌టిక‌ప్పుడు గుజ‌రాత్ లోని అహ్మాదాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ చేశారు. విమాన భ‌ద్ర‌తా సిబ్బంది రంగంలోకి దిగారు. విమానంలోని ప్రయాణికుల్ని దించేసిన సిబ్బంది.. విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించారు.

అయితే.. బెదిరింపు లేఖ‌లో పేర్కొన్న‌ట్లుగా బాంబులు ల‌భించ‌లేదు. దీంతో.. ఇదంతా ఉత్తుత్తి బెదిరింపులన్న విష‌యాన్ని గుర్తించి.. ఈ దారుణానికి పాల్ప‌డిన వ్య‌క్తి ఎవ‌ర‌న్న విష‌యాన్ని గుర్తించే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌ర‌కు పుణేకు చెందిన కిశోర్ గా గుర్తించారు.

గ‌తంలో ఇత‌గాడికి జెట్ ఎయిర్ వేస్ కు పంచాయితీ ఉంది. విమానంలో త‌న‌కు ఇచ్చిన ఆహారంలో బొద్దింక క‌నిపించిందంటూ పెద్ద గొడ‌వ పెట్టుకున్నాడు. అంతేకాదు.. జెట్ ఎయిర్ వేస్ లో ప‌ని చేసే ఒక యువ‌తి మీద క‌న్నేసిన ఆయ‌న‌.. ఆమె ఉద్యోగాన్ని పోగొడితే త‌న కోరిక తీరుతుంద‌న్న పిచ్చి ఆలోచ‌న చేశాడు.

ఇందులో భాగంగా ఉత్తుత్తి నాట‌కాన్ని వేశాడు. ఇందుకోసం బాలీవుడ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని ఈ నాట‌కానికి తెర తీశారు. రీల్ లైఫ్‌కి.. రియ‌ల్ లైఫ్ కు చాలా తేడా ఉంటుంద‌న్న విష‌యాన్ని గుర్తించ‌ని అత‌గాడ్ని అధికారులు అదుపులోకి తీసుకోవ‌టంతో పాటు కేసు న‌మోదు చేశారు. అతడిపై నిషేధం విధిస్తూ పౌర విమానయాన శాఖ నిర్ణ‌యం తీసుకుంది. అత‌గాడి మాన‌సిక ప‌రిస్థితి స‌రిగా లేద‌న్న మాట‌ను అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఒకడి కార‌ణంగా జెట్ ఎయిర్ వేస్ వ‌ణికిపోవ‌ట‌మేకాదు.. ఈ స‌మాచారంలో ల‌క్ష‌లాది మంది ఆందోళ‌న‌కు గురయ్యారు.