Begin typing your search above and press return to search.

ముంబైకి కళ్లుబైర్లు 'కమ్మిన్స్'.. హ్యాట్రిక్ ఓటమి

By:  Tupaki Desk   |   7 April 2022 8:56 AM GMT
ముంబైకి కళ్లుబైర్లు కమ్మిన్స్.. హ్యాట్రిక్ ఓటమి
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ ఎడిషన్ లో ముంబై ఇండియన్స్ కు ఏదీ కలిసి రావడం లేదు. బుధవారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లోనూ అనూహ్యంగా ఓటమిపాలైంది. గెలుపు ఖాయం అనుకున్న పరిస్థితుల నుంచి దారుణంగా ఓటమిపాలైంది ముంబై. ఓటమి కంటే ఓడిన తీరే అత్యంత బాధాకరంగా ఉంది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో ముంబై ఇన్నింగ్స్ చాలా పేలవంగా ప్రారంభమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ 12 బంతులాడి 3 పరుగులే చేయగలిగాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఉన్నంతసేపూ ఇబ్బందిపడ్డాడు. 21 బంతులాడిని అతడు చేసింది 14 పరుగులే. అయితే, దక్షిణాఫ్రికా యువ కెరటం, జూనియర్ డివిలియర్స్ డెవాల్డ్ బ్రేవిస్ (19 బంతుల్లో 29, 2 ఫోర్లు, 2 సిక్స్ లు) మాత్రం ఆకట్టుకున్నాడు.

కానీ, వరుణ్ చక్రవర్తి ఓవర్లో స్టంపౌటయ్యాడు. అలాంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్సులు)కు జత కలిసిన హైదరాబాదీ యువ తిలక్ వర్మ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుతంగా ఆడాడు. చివర్లో పొలార్డ్ (5 బంతుల్లో 22నాటౌట్, 3 సిక్సులు) మెరుపులతో 161 పరుగుల గౌరవప్రద స్కోరు దక్కింది. 11 ఓవర్లకు ముంబై స్కోరు 55. దీన్నిబట్టి చూస్తే చివరి 9 ఓవర్లలో 106 పరుగులు చేసిన ముంబై గెలుపు అవకాశాలను కల్పించుకుంది. ఛేదనకు దిగిన కోల్ కతా ఓపెనర్లలో అజింక్య రహానే (11 బంతుల్లో 7) తీవ్రంగా నిరాశపర్చగా, వెంకటేశ్ అయ్యర్ (41 బంతుల్లో 50 నాటౌట్ ) నిలదొక్కుకున్నాడు.

అయితే, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6 బంతుల్లో 10, 2 ఫోర్లు), సామ్బిల్లింగ్స్ (12 బంతుల్లో 17, 2 సిక్సులు), నితీశ్ రాణా (7 బంతుల్లో 8; 1 సిక్స్), రస్సెల్ (5 బంతుల్లో 11; ఫోర్, సిక్స్) విఫలమవడంతో మ్యాచ్ ముంబై వైపు మొగ్గింది. ఫలితంగా చేతిలో ఐదు వికెట్లుండగా 41 బంతుల్లో 61 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. వెంకటేశ్ మాత్రమే గుర్తింపు పొందిన బ్యాట్స్ మన్. బుమ్రా, సామ్స్, మిల్స్ వంటి ముంబై బౌలర్లను ఎదుర్కొంటూ వారు వెంకటేశ్, కొత్తగా క్రీజులోకి వచ్చిన ప్యాట్ కమ్మిన్స్ కోల్ కతా ను గెలిపించడం కష్టమే అనిపించింది. కానీ, అప్పుడు మొదలైంది అసలైన విధ్వంసం.

వామ్మో ఏం బాదుడది?15 బంతులు.. 56 పరుగులు.. 4 ఫోర్లు, 6 సిక్సులు.. ఇదీ కమ్మిన్స్ సాగించిన విధ్వంసం. 14 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన అతడు .. ఐపీఎల్ లో వేగవంతమైన అర్థ సెంచరీ రికార్డు (2018లో కేఎల్ రాహుల్)ను సమం చేశాడు. వాస్తవానికి ఇటీవల పాకిస్థాన్ లో పర్యటించిన ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన కమ్మిన్స్ వన్డే సిరీస్ ఆడకుండానే ఐపీఎల్ కు వచ్చాడు.

క్వారంటైన్ పూర్తయిన వెంటనే బరిలో దిగాడు. బుధవారం నాటి మ్యాచే ఈ లీగ్ లో అతడికి మొదటిది. అలా వస్తూనే విరుచుకుపడి విధ్వంసం రేపాడు. అయితే అంతకుముందు అతడు బౌలింగ్ లో (2/49) విఫలమయ్యాడు. చివరి ఓవర్లో 23 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ, బ్యాటింగ్ లో అందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు.

ఒక్క ఓవర్లో 35 పరుగులు..కమ్మిన్స్ విధ్వంసం 16వ ఓవర్లో పతాక స్థాయిలో సాగింది. అప్పటికి గెలుపు కోసం 36 బంతుల్లో కోల్ కతా 35 పరుగులు చేయాలి. సమీకరణం కష్టమే అనిపించింది. కానీ, కమ్మిన్స్ స్వరూపమే మార్చేశాడు. 6, 4, 6, 6, 4, 6తో విరుచుకుపడ్డాడు. మధ్యలో నాలుగో బంతి నో బాల్ కాగా 2 పరుగులు చేశాడు. దీంతో ఈ ఒక్క ఓవర్ లోనే 35 పరుగులు వచ్చేశాయి. కోల్ కతా గెలిచేసింది.