Begin typing your search above and press return to search.

బాంబే హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది

By:  Tupaki Desk   |   29 Aug 2015 9:35 AM GMT
బాంబే హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది
X
వినాయక‌చ‌వితి వ‌స్తుందంటే.. మండ‌పాలు.. ఊరేగింపులు.. భారీగా నిమ‌జ్జ‌నం లాంటివి మామూలే. అయితే.. గ‌ణేశ్ ఉత్సవాల నిర్వ‌హ‌ణ‌పై తాజాగా దాఖ‌లైన ఒక వ్యాజ్యాన్ని విచారించిన సంద‌ర్భంగా బాంబే హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. గ‌ణేశ్ ఉత్స‌వాలుద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో బాంబే హైకోర్టు వ్యాఖ్య ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ముంబ‌యిలోని ప్ర‌ఖ్యాత శివాజీ పార్కులో ర‌థ‌యాత్ర చేసేందుకు అధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ అనుమ‌తి కోరుతూ పిటీష‌న్ దాఖ‌లు చేసింది. ఈ సంద‌ర్భంగా విచారించిన కోర్టు.. గ‌ణేశ్ ఉత్స‌వాలు అంత భారీగా నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించ‌ట‌మే కాదు..ఒక వార్డుకు ఒక మండ‌పం మాత్ర‌మే ఉండాల‌ని డివిజ‌న్ బెంచ్ పేర్కొంది. న్యాయ నిబంధ‌న‌ల ప్ర‌కారం తాము ఇలాంటి వాటికి వ్య‌తిరేకం అంటూనే.. న‌గ‌రంలో అన్నిప్రాంతాల్లో జ‌న‌జీవితం స్తంభించిపోయేలా గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం.. దుర్గాపూజ లాంటి వాటిని ఇక‌పై మానుకోవాలంది. భారీ హంగులు.. ఆర్భాటాలు చేయాల్సిన అవ‌స‌రం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తూ.. గ‌ణేశ్ ఉత్స‌వాల సంద‌ర్భంగా చేసే వ‌సూళ్లు.. బ‌ల‌వంత‌పు వ‌సూళ్లుగా అభిప్రాయ‌ప‌డింది. పెద్ద శ‌బ్దంతో మైకులు పెడుతూ.. ట్రాఫిక్ జాం చేస్తూ.. ఉత్స‌వాల్ని ఇంత భారీగా చేయాల్సిన అవ‌స‌రం ఏమిట‌ని ప్ర‌శ్నించింది.

అంతేకాదు.. ఇస్కాన్ నిర్వ‌హిస్తాన‌న్న శివాజీపార్కు లో ట్రాక్ దెబ్బ తింటుంద‌ని.. ప్ర‌జ‌లు భారీగా పాల్గొనే ర‌థ‌యాత్ర‌ను క్రీడా ప్రాంగణంలో నిర్వ‌హించేందుకు తాము అనుమ‌తి ఇవ్వ‌లేమంది.