Begin typing your search above and press return to search.

సంచలనానికి వేదిక కానున్నముంబై

By:  Tupaki Desk   |   18 April 2022 6:31 AM GMT
సంచలనానికి వేదిక కానున్నముంబై
X
తొందరలోనే ముంబై నగరం మరో రాజకీయ సంచలనానికి వేదిక కాబోతోంది. తొందరలోనే బీజేపీ యేతర ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతోంది. ఈ విషయాన్ని శివశేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మధ్య చర్చలు జరిగినట్లు కూడా రౌత్ తెలిపారు. తొందరలోనే మమతాబెనర్జీ దగ్గర నుండి బీజేపీయేతర ముఖ్యమంత్రులందరికీ లేఖలు వెళ్ళబోతోందట.

రెండు రోజుల క్రితమే దేశంలో పెరిగిపోతున్న మత విధ్వేషాలు, మత ఘర్షణలు, విద్వేష ప్రసంగాలపై కాంగ్రెస్ తో సహా దేశంలోని 13 పార్టీల అధినేతల సంతకాలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఒక నిరసన లేఖ పంపిన విషయం తెలిసిందే. దాంతోనే ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. అలాంటిది తొందరలోనే బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశమంటే ఇక చెప్పాల్సిన అవసరమేలేదు.

నరేంద్రమోడికి అనుకోవచ్చు లేదా బీజేపీకి వ్యతిరేకంగా అనుకోవచ్చు ఇప్పటికే మమతా బెనర్జీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టడమే టార్గెట్ గా పెట్టుకుని మమత పావులు కదుపుతున్నారు.

ఇదే సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే తమిళనాడు, ఒడిస్సా, బెంగాల్ ముఖ్యమంత్రులతో సమావేశాలు కూడా నిర్వహించారు.

ఇదే సందర్భంలో తమిళనాడు ముఖ్యమంత్రి, యూపీఏ భాగస్వామ్యపార్టీ డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా అవే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే బీజేపీని గద్దె దింపటానికి వివిధ రూపాల్లో ప్రయత్నాలు జరుగుతున్నా వారందరినీ ఏకతాటిపైకి తెచ్చే వారే లేరు. సరిగ్గా ఇక్కడే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్ర కీలకంగా మారుతోంది.

ఎందుకంటే కాంగ్రెస్ కే కాకుండా మమతాబెనర్జీ, కేసీయార్, స్టాలిన్, పవార్ లాంటి అనేకమందికి పీకే బాగా సన్నిహితుడు. అందుకనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి, మమత, కేసీయార్ తరచూ పీకేతో సమావేశమవుతున్నారు. సో తొందరలోనే ముంబై మరో సంచలనానికి వేదిక కాబోతున్నది.