Begin typing your search above and press return to search.

రియ‌ల్ గానే.. ముంబ‌యి ఫైర్ యాక్సిడెంట్ లో రోబో!

By:  Tupaki Desk   |   23 July 2019 4:29 AM GMT
రియ‌ల్ గానే.. ముంబ‌యి ఫైర్ యాక్సిడెంట్ లో రోబో!
X
అప్పుడెప్పుడో వ‌చ్చి సూప‌ర్ హిట్ గా నిలిచిన రోబో సినిమా గుర్తుందా? ఫైర్ యాక్సిడెంట్ వేళ.. ర‌జ‌నీ పాత్ర‌ధారి సృష్టించిన రోబో సాయం చేయ‌టం.. బాధితుల్ని ఆదుకోవ‌టం చూశాం. దాదాపు అలాంటి సీన్ కాకుండా.. దానికి ద‌గ్గ‌ర‌గా ఉండే సీన్ ఒక‌టి తాజాగా దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి ప్ర‌జ‌లు చూడ‌గ‌లిగారు.

ముంబ‌యిలో అత్యంత ఖ‌రీదైన బాంద్రా ప్రాంతంలో సోమ‌వారం భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ మంట‌ల్ని ఆర్పేందుకు అగ్నిమాప‌క ద‌ళంతో పాటు.. రోబో కూడా రంగంలోకి దిగి.. స‌హాయ‌క చ‌ర్య‌ల్ని అందించింది.

దేశంలో మొద‌టిసారి అగ్నిప్ర‌మాదాల స‌మ‌యంలో సేవియ‌ర్ గా రోబోను దింప‌టం వివేషం. తొమ్మిది అంత‌స్తులున్న ఎంటీఎన్ ఎల్ భ‌వ‌నంలోని మూడు.. నాలుగు అంత‌స్తుల్లో ఎగిసి ప‌డిన మంట‌ల్ని ఆర్పేందుకు రోబో రంగంలోకి దిగింది. దీని పేరు రోబో ఫైర్. రిమోట్ తో ఆప‌రేట్ చేసే అవ‌కాశం ఉన్న ఈ రోబోకు ఒక కెమెరాను ఫిక్స్ చేశారు. కీల‌కంలా ప‌ని చేస్తూ.. ఎలాంటి నేల మీద అయినా సుల‌భంగా ముందుకు వెళ్ల‌గ‌ల‌దు.

కెమెరా సాయంతో మంట‌ల్లో చిక్కుకుపోయిన గ‌దుల్లో ఎవ‌రైనా బాధితులు చిక్కుకుపోయార‌న్న విష‌యాన్ని గుర్తించే వీలుంది. అగ్నిప్ర‌మాదం చోటు చేసుకున్న వెంట‌నే.. ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు అగ్నిప్ర‌మాదంలో చిక్కుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. మంట‌ల్లో చిక్కుకున్న వారిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చిన‌ట్లుగా ఎంటీఎన్ ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్త‌వ వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ అగ్నిప్ర‌మాదం వేళ‌.. రోబో సేవ‌ల్ని వినియోగించ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.