Begin typing your search above and press return to search.

కారు చీకట్లో ముంబై మహానగరం .. ప్రజలకు ఇక్కట్లు - ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   12 Oct 2020 1:30 PM GMT
కారు చీకట్లో ముంబై మహానగరం .. ప్రజలకు ఇక్కట్లు - ఏమైందంటే ?
X
దేశ ఆర్థిక రాజధాని ముంబై ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోయింది. టాటా పవర్ యూనిట్ దెబ్బతినడంతో ఒక్కసారిగా సిటీ మొత్తం పవర్ సప్లై ఆగిపోయింది. ఎటు చూసినా చీకట్లే. ఎక్కడికక్కడ ప్రజా రవాణా ఆగిపోయింది. రైళ్లు నడవట్లేదు. పనులన్నీ నిలిచిపోయాయి. ప్రజలు ఆగ్రహావేశాలతో విద్యుత్ అధికారులకు కాల్స్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌత్ ముంబై, సెంట్రల్ ముంబై, నార్త్ ముంబై అంతటా ఈ చీకటి అలుముకుంది.

ఈ ఉదయం 10 గంటల సమయంలో ముంబై మహానగరానికి విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది. ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ పరిధిలోని ఏ ఒక్క ప్రాంతంలో కూడా కరెంటు లేని పరిస్థితి నెలకొంది. ముంబై మహానగరానికి విద్యుత్‌ను సరఫరా చేసే గ్రిడ్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాలే దీనికి కారణమని అధికారులు గుర్తించారు. యుద్ధ ప్రాతిపదికన వాటిని సరి చేస్తున్నారు. ఆసుపత్రులు వంటి అత్యవసర సేవల కోసం మాత్రమే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు.

ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో ఒక్కరోజు విద్యుత్ వినియోగం 385 మెగావాట్ల వరకు ఉంటుంది. అక్కడి విద్యుత్ సరఫరా వ్యవస్థ మొత్తం ప్రైవేటు సంస్థ చేతుల్లో ఉంది. అదాని ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఏఈఎంఎల్), టాటా పవర్, బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) సంస్థలు విద్యుత్‌ను సరఫరా చేస్తుంటాయి. ముంబైకి విద్యుత్‌ను సరఫరా చేసే ఖల్వా-పడ్ఘే-ఖార్‌ఘర్ గ్రిడ్‌లో ఒక్కసారిగా సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీనితో ఉదయం 10 గంటల నుంచి కరెంటు సరఫరా నిలిచిపోయింది.

ముంబైలో ఏం జరగాలన్నా... కరెంటుతో పని తప్పదు. అందువల్ల ప్రభుత్వ సంస్థ బెస్ట్ ద్వారానే పవర్ సప్లై అయ్యేలా చేస్తున్నారు. బెస్ట్ అంటే... బ్రిహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్. ఈ సంస్థ... టాటా పవర్ నుంచి విద్యుత్ పొందుతోంది. దాదాపు 10 లక్షల మందికి ఈ కరెంటు సప్లై అవుతోంది. వాళ్లంతా ఇప్పుడు చీకట్లో ఉన్నారు. తాము ఇతర మార్గాల ద్వారా కరెంటు సప్లై జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని బెస్ట్ తన ప్రకటనలో తెలిపింది.