Begin typing your search above and press return to search.

సెకన్ల‌లో మ‌ర‌ణం..లైంగిక దాడి..ఆభ‌ర‌ణాల చోరి

By:  Tupaki Desk   |   2 Oct 2017 6:48 AM GMT
సెకన్ల‌లో మ‌ర‌ణం..లైంగిక దాడి..ఆభ‌ర‌ణాల చోరి
X
ముంబయిలోని ఎల్ఫిన్‌స్టోన్ ప్ర‌మాదంలో అవాక్క‌య్యే ఘ‌ట‌న‌లే కాదు...సిగ్గుతో త‌ల‌దించుకునే ఉదంతాలు జ‌రిగాయి. దుర్మార్గ‌పు ప‌నుల‌ను చూసి స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే ఉదంతాల‌కు కొంద‌రు పాల్ప‌డ్డారు. కొన్ని సెకన్ల‌లో మ‌ర‌ణం సంభ‌విస్తుంద‌నే ఉదంతాలు ఉండ‌గా ఓ మ‌హిళ‌ ఆభ‌ర‌ణాల చోరీ జ‌రిగింది. అంతేకాకుండా ఆమెపై లైంగిక దాడి జ‌రిగింది. ఎల్ఫిన్‌ స్టోన్ రైల్వే స్టేష‌న్ వ‌ద్ద‌ శుక్రవారం జరిగిన తొక్కిసలాట స‌మ‌యంలో ఒక మహిళా బాధితురాలిపై లైంగిక దాడి జరిగిన విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఆమె చనిపోవడానికి కొద్ది సెకన్ల‌ ముందు ఆమెపై అత్యాచారం జరగడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలతో ఉన్న ఒక వీడియో క్లిప్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీంతో పోలీసులు ఈ ఉదంతంపై విచార‌ణ చేప‌ట్టారు.

రైల్వే స్టేష‌న్‌ లో అక‌స్మాత్తుగా జ‌రిగిన తొక్కిసలాటలో ఆమెపై పలువురు బాధితులు గుట్టలుగా పడిపోయారు. ఈ సందర్భంలో పక్కనే ఉన్న వ్యక్తి ఆమెపై అత్యాచారయ‌త్నానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యం స్ప‌ష్టంగా కనిపించింది. ఆ సంఘటన తర్వాత ఆమె చాలా బలహీనంగా కనిపించడం ఈ వీడియోలో ఉంది. సహాయం కోసం అర్థిస్తూ చేతిని కిందకి వదిలేసి తుది శ్వాస విడిచిన చిత్రాలు ప‌లువురిని క‌లిచివేస్తున్నాయి. ఎల్ఫిన్‌ స్టోన్‌ స్టేషన్‌ వద్ద చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న సిగ్గుచేట‌ని ప‌లువురు నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. మాన‌వ‌త్వం మ‌రిచి రాక్ష‌స‌త్వంతో ఆమెపై అత్యాచార‌య‌త్నానికి ఒడిగ‌ట్టార‌ని ఆక్షేపిస్తున్నారు.

మ‌రోవైపు ఈ ఉదంతంలో చోరీలు కూడా జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ తోపులాట క‌ల‌క‌లం స‌మ‌యంలోనే పలువురి పర్సులను - నగలను - ఆభరణాలను దొంగిలించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. త‌మ కుటుంబ స‌భ్యురాలు ఈ విచార సంఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిందని, చోరీకి గురైన వాటిలో ఆమెకు చెందిన న‌గ‌ల‌ను కొన్నింటిని త‌మ‌కు అందించార‌ని తెలిపారు. అయితే ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన త‌ర్వాత‌నే త‌మ‌కు న‌గలు అందాయ‌ని లేక‌పోతే అవి త‌మ‌కు ద‌క్కేవి కావ‌ని వాపోయారు. మ‌రిన్ని న‌గ‌లు అందాల్సి ఉంద‌ని తెలిపారు. కాగా, ఈ సంఘటనలపై రైల్వే పోలీసు కమిషనర్‌ స్పందిస్తూ తాము కూడా విచారణ ప్రారంభించామని చెప్పారు.

కాగా, తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కేఈఎం ఆసుపత్రిలో చికిత్స పొందతున్న ఒక బాధితుడు మృతి చెందాడని ఆసుపత్రి డీన్‌ చెప్పారు. దీంతో ఈ సంఘటనలో మృతుల సంఖ్య 23కు చేరుకుంది. మ‌రోవైపు ఈ విషాద సంఘటన ప్రయాణీకుల భద్రతపై పలు ఆందోళనలు రేకెత్తించడంతో రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ రైల్వే బోర్డు అధికారులతో సమావేశమయ్యారు. భద్రతా పరమైన సమస్యలను పరిష్కరించేందుకు అత్యవసరంగా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ప్ర‌మాదాల నివార‌ణ‌కు త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు.