Begin typing your search above and press return to search.

రజినీ యోగ ముద్రపై కాపీ ఆరోపణలు

By:  Tupaki Desk   |   7 Jan 2018 4:45 PM GMT
రజినీ యోగ ముద్రపై కాపీ ఆరోపణలు
X
రాజకీయ పార్టీ పెడుతున్న రజనీకాంత్ ఇమేజిని క్యాష్ చేసుకోవడానికి అవకాశమున్న ప్రతి ఒక్కరూ పోటీ పడుతున్నారు. ఆయన వెబ్ సైట్ పేరును పోలిన కొత్త వెబ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. రజనీ పార్టీ పెడితే అందులో చేరాలని కొందరు నేతలు ఎదురుచూస్తున్నారు. అసలు.. రజినీనే తమకు మద్దతిస్తే బాగుంటుందని బడా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ముంబయికి చెందిన ఓ సాప్ట్ వేర్ సంస్థ కూడా రజనీ ఇమేజిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తోంది. మొన్న రాజకీయ ప్రవేశ ప్రకటన చేసినప్పుడు రజనీ చూపించిన యోగ ముద్ర తమ సంస్థ లోగోకు కాపీ అని ఆ సంస్థ ఆరోపిస్తోంది.

ముంబయికి చెందిన వాక్స్ వెబ్ సంస్థ ఒక నెట్‌ వర్కింగ్ యాప్ నిర్వహిస్తోంది. ఆ సంస్థ లోగోలో చిటికెన వేలి పక్కనున్న రెండు వేళ్లు మడిచి ఉన్న గుర్తు ఉంటుంది. అయితే.. ఈ సంస్థ ఏర్పడి గట్టిగా ఏడాదిన్నర మాత్రమే అయింది. కానీ... రజినీ కాంత్ 2002లో తీసిన బాబా సినిమా నుంచే అలాంటి ముద్రను చూపిస్తున్నారు. దీన్ని యోగ భాషలో అపాన ముద్ర అంటారు. మహావతార్ బాబాజీని విశ్వసించే రజినీ కాంత్ ఆయన చూపించే ఈ యోగ ముద్రనే తానూ ప్రదర్శిస్తుంటారు.

మరోవైపు వాక్స్‌ వెబ్ లోగోకు - రజినీ చూపించే ముద్రకు మధ్య వ్యత్యాసం కూడా ఉంది. మడిచిన వేళ్లను బొటన వేలితో మూస్తారు రజినీ. కానీ, వాక్స్ వెబ్ లోగోలో బొటన వేలు పైకి చూపిస్తుంటుంది. పైగా ఈ అపానముద్ర ఏమీ ఇప్పటిది కాదు. రజినీ కూడా చాలాకాలంగా దీన్ని వాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాక్స్ వెబ్ కేవలం వార్తల్లో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించడానికే ఇలా చేస్తుందన్న విమర్శల వస్తున్నాయి. కాగా ఆ సంస్థ యాజమాన్యం దీనిపై రజినీకి లేఖ కూడా రాసిందట. రజినీ నుంచి వచ్చే స్పందనను బట్టి ఏం చేయాలో నిర్ణయిస్తామని వారంటున్నారు.