Begin typing your search above and press return to search.

'బొందుగాడు' మాదిరే ఫ్యూచర్ లో 'మునావర్' దెబ్బేయనున్నాడట!

By:  Tupaki Desk   |   21 Aug 2022 5:34 AM GMT
బొందుగాడు మాదిరే ఫ్యూచర్ లో మునావర్ దెబ్బేయనున్నాడట!
X
కొన్ని నిర్ణయాలు తీసుకున్నంతనే ప్రభావాన్ని చూపవు. మనం ఒకలా మొదలు పెడితే.. అవి కాస్తా మరోరకంగా టర్న్ తీసుకోవటం అప్పుడప్పుడు చూస్తుంటాం. అలాంటి ఉదంతమే ఒకటి తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ లో ఎదుర్కోనుందన్న మాట బలంగా వినిపిస్తోంది. దేశంలోని పలు నగరాల్లో వరుస పెట్టి రద్దు అవుతున్న స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖి 'షో'ను హైదరాబాద్ మహానగరంలో దిగ్విజయంగా పూర్తి చేశారు. బీజేపీతో పాటు హిందూ సంస్థల నిరసనలు..ఆందోళనలు.. వార్నింగుల మధ్య అసలు జరుగుతుందా? లేదా? అన్న సందేహాల నడుమ పోలీసుల పర్యవేక్షణలో ఈ షోను పూర్తి చేశారు. తెలంగాణలో టెన్షన్ క్రియేట్ చేసిన మునావర్ షోను ఎట్టి పరిస్థితుల్లోను జరగాల్సిందేనని పట్టుబట్టి మరీ ప్రభుత్వం తాను అనుకున్న పనిని పూర్తి చేసిందంటున్నారు.

అయితే.. మునావర్ షో పుణ్యమా అని.. తెలంగాణ అధికారపక్షానికి రానున్న రోజుల్లో డ్యామేజ్ జరుగుతుందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. దేశంలోని వేర్వేరు నగరాల్లో రద్దైన ఈ షో.. హైదరాబాద్ లో నిర్వహించటానికి కారణం తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన మంత్రి కేటీఆర్ జోక్యంతోనే అన్న మాట ఇప్పుడు విస్తృతంగా వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా షోను నిర్వహించిన వేదిక శిల్పకళావేదిక వద్ద.. ఏకంగా 2వేల మంది పోలీసు సిబ్బంది మొహరించటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.

ఒక ప్రైవేటు షోకు.. అందునా పెయిడ్ షో కోసం ఇంత భారీగా పోలీసుల్ని వినియోగించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వ పెద్దలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటమే 'షో'ను నిర్వహించారని చెబుతున్నారు. ఆ మధ్యన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హిందుగాళ్లు.. బొందుగాళ్లు అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల్ని తమకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ.. ఇప్పుడీ షోను సైతం అదే రీతిలో వాడుకోవాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసిన మునావర్ ఫారుఖీని హైదరాబాద్ లో షో నిర్వహించేందుకు ఓకే చెప్పటం అంటే.. హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్లే అన్న వాదనను బీజేపీ నేతలు ఇప్పటికే షురూ చేశారు.

రానున్న రోజుల్లో ఈ రగడ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. అదే జరిగితే.. హిందుగాళ్లు బొందుగాళ్లు అన్న కేసీఆర్ అసంకల్పిత ప్రకటన చేసిన డ్యామేజ్ మాదిరే రానున్న రోజుల్లో మునావర్ ఫారుఖీ షో వ్యవహారం కూడా ఓటు బ్యాంకుకు నష్టం వాటిల్లేలా చేస్తుందని చెబుతున్నారు. ఈ షోకు హాజరైన వారిలో ఏ ఒక్కరి వద్ద మొబైల్ ఫోన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా.. షోలో అతగాడు చేసిన వ్యాఖ్యలు బయటకు వచ్చే వీలుండే ఛాన్స్ లేదని చెబుతున్నారు.

అందుకు భిన్నంగా 'షో'లో ఏదైనా జరిగి ఉండి.. అందులో ఏమైనా అభ్యంతరకర వ్యాఖ్యలు అతగాడు చేసి ఉంటే మాత్రం గులాబీ కారుకు మరింత డ్యామేజ్ ఖాయమంటున్నారు. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అలాంటివేమీ లేకుండానే మునావర్ షో జరిగినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు లేకుండానే.. తనమార్కు కామెడీతోనే షో పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక.. ఈ షో నిర్వహణపై వేర్వేరు వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతల మాటల్లో చెప్పాలంటే మునావర్ షోను హైదరాబాద్ లో నిర్వహించటం అంటే.. నిప్పుతో చెలగాటమాడినట్లేనని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మునావర్ షోను విజయవంతంగా నిర్వహించిన క్రెడిట్ తెలంగాణ ప్రభుత్వానికి దక్కితే.. అందుకు సంబంధించిన నెగిటివిటీ కూడా కేసీఆర్ సర్కారుకు చుట్టుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో టీఆర్ఎస్ వర్గాల వాదన ప్రకారం.. బీజేపీ వ్యతిరేకత ఐడియాలజీని దేశంలో ఎవరూ వినిపించలేనంత బలంగా వినిపించే సత్తా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని.. ఇది కేసీఆర్ సర్కారుకి కొత్త ఇమేజ్ తెచ్చి పెడుతుందన్న వాదనను వినిపిస్తున్నారు. ఎవరి వాదన నిజమవుతుందన్నది కాలమే డిసైడ్ చేస్తుందని చెప్పక తప్పదు.