Begin typing your search above and press return to search.

అసెంబ్లీ ఫలితాలనే మించిపోయిందా ?

By:  Tupaki Desk   |   15 March 2021 8:30 AM GMT
అసెంబ్లీ ఫలితాలనే మించిపోయిందా ?
X
తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే మొన్నటి అసెంబ్లీ ఫలితాలను మించిపోయిందనే అనిపిస్తోంది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీ జిల్లాలకు జిల్లాలనే తన ఖాతాలో వేసుకుంది. రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలులో ఒక్క సీటును కూడా టీడీపీ గెలవలేదు. ఇక చిత్తూరులో చంద్రబాబునాయుడు, అనంతపురం జిల్లాలో నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ మాత్రమే గెలిచారు. అంటే రాయలసీమలోని 52 సీట్లలో టీడీపీ గెలిచింది 3 చోట్ల మాత్రమే.

ఇక కోస్తా జిల్లాలైన ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా అత్యధిక సీట్లను వైసీపీనే గెలిచింది. నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీలకు పదీ వైసీపీ ఖాతాలోనే పడింది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అత్యధికం వైసీపీనే గెలిచింది. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఒక్కసీటు కూడా టీడీపీ గెలవలేదు. శ్రీకాకుళం జిల్లాలోని 10 సీట్లలో రెండు మాత్రమే గెలిచింది. వైజాగ్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 4 మాత్రమే టీడీపీ గెలిచింది.

దాదాపు రెండేళ్ళ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అసెంబ్లీ ఫలితాలను మించి వైసీపీ గెలుచుకుంది. 75 మున్సిపాలిటిలకు గాను కేవలం రెండు చోట్ల మాత్రమే టీడీపీ అత్యధిక వార్డులను గెలుచుకుంది. వీటిల్లో కూడా ఎక్స్ అఫీషియో ఓట్ల వల్ల ఛైర్మస్ స్ధానాలను వైసీపీకే దక్కే అవకాశం ఉంది. ఇక 11 మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం ఒక్క కార్పొరేషన్లో కూడా టీడీపీ గెలవలేదు. మామూలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారపార్టీపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతుంది.

కానీ ఇందుకు భిన్నంగా ప్రజాధరణ పెరిగినట్లు అర్ధమవుతోంది. ఒకవైపు చంద్రబాబు అండ్ కో మరోవైపు టీడీపీకి మద్దతుగా 90 శాతం మీడియా జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత పెంచటానికి ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాల వల్లే జనాధరణ పెరిగినట్లు అనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాల బురద చల్లుడు రాజకీయాలను జనాలు చాలా నిసితంగా గమనించినట్లున్నారు. అందుకనే ఎవరెంత చెప్పినా జనాలు పట్టించుకోలేదు.

చివరకు వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణకు ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేకపోయినా చంద్రబాబు+మద్దతు మీడియా మాత్రం జగనే కారణమని పదే పదే బురద చల్లేశాయి. అయితే వాస్తవం ఏమిటో తెలిసిన జనాలు వీళ్ళ ఆరోపణలను పట్టించుకోలేదు. అలాగే దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం తదితరాలపై జగన్ పై ప్రతిపక్షాల ఆరోపణలను జనాలు నమ్మలేదని అర్ధమవుతోంది. మొత్తం మీద అధికారపక్షం ఇంతస్ధాయిలో స్ధానిక సంస్ధల్లో గెలవటం బహుశా ఇదే మొదటిసారేమో.