Begin typing your search above and press return to search.

తాజా ఎన్నికల ఫలితం.. 3 రాజధానులకు ఓకే చెప్పినట్లేనా?

By:  Tupaki Desk   |   15 March 2021 3:45 AM GMT
తాజా ఎన్నికల ఫలితం.. 3 రాజధానులకు ఓకే చెప్పినట్లేనా?
X
తాజాగా వెల్లడైన ఏపీ మున్సిపోల్స్ ఫలితాలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. పలు సందేహాలు.. సంశయాల నడుమ ఎన్నికల బరిలో దిగిన అధికార పార్టీకి ఏపీ ప్రజలు హారతి పట్టారు. ఘన విజయాన్ని అందించటం ద్వారా.. అధికారపక్షం తరఫు తాము ఉన్నామన్న విషయాన్నిఓటర్లు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీలోని మూడు కీలక ప్రాంతాలైన కోస్తా.. రాయలసీమ.. ఉత్తరాంద్ర.. ఇలా మూడు చోట్ల అధికార వైసీపీ విజయాన్ని సొంతం చేసుకుంది.

దీంతో.. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల కాన్సెప్టుకు ఏపీ ప్రజల అనుమతి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రాంతాలు వేరైనా..సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉందన్న విషయాన్ని ఓటుతో తీర్పు ఇచ్చేశారన్న మాట వినిపిస్తోంది. మూడు రాజధానులుగా పేర్కొన్న గుంటూరు.. కర్నూలు.. విశాఖలో అధికార పార్టీనే విజయాన్ని సొంతం చేసుకోవటంతో.. వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రజలు ఓకే చెప్పినట్లుగా భావించాలి.

తాజా ఫలితాలతో కొన్ని అంశాలపై క్లారిటీ వచ్చినట్లుగా చెప్పాలి. అన్ని ప్రాంతాల వారు జగన్ పాలనలోని అభివృద్ధికి జై కొట్టారని చెప్పాలి. అంతేకాదు.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. ఆందోళనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్లుగా భావించాలన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో పస లేదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.

తాజాగా ఫలితాలు వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో విపక్ష నేత చంద్రబాబు గుంటూరు.. విశాఖ ప్రాంతాల ప్రజల్ని భావోద్వేగంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికి ఓటర్లు మాత్రం వైసీపీ వెంటే ఉన్నట్లుగా తాజా ఫలితాలుస్పష్టం చేస్తున్నాయి. అమరావతికి అనుకూలంగా ఉద్యమం విషయానికివస్తే.. రెండు జిల్లాల్లోని ఏ ఒక్క కార్పొరేషన్ కానీ.. మున్సిపాల్టీ లో కానీ టీడీపీ గెలవకపోవటం గమనార్హం. ఇదంతా చూస్తే.. విపక్ష టీడీపీ వాదించే అమరావతి విషయంలో ఆ పార్టీ అధినేత చెప్పే మాటలకు అనుగుణంగా ఓటర్లు లేరన్న విషయం తాజా ఫలితాలు స్పష్టం చేశాయని చెప్పాలి.