Begin typing your search above and press return to search.

ఏపీలో సిత్రం.. రెండుచోట్ల గెలవటం ఆయన కొంప ముంచింది

By:  Tupaki Desk   |   18 March 2021 9:30 AM GMT
ఏపీలో సిత్రం.. రెండుచోట్ల గెలవటం ఆయన కొంప ముంచింది
X
ఏపీలో ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ఒక సిత్రం చోటు చేసుకుంది. స్థానిక ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఒక నేత.. ఉప సర్పంచ్ గా పోటీ చేసి ఆ స్థానాన్ని సొంతం చేసుకున్న ఆయనకు.. తాజాగా అన్నిపదవులు దూరం కావటం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా గెలవటమే ఆయన పదవులు పోయేలా చేసిందన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ గెలవటమే కొంప మునగటానికి కారణమైనట్లుగా చెబుతున్న ఈ ఉదంతం ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? చాలా అరుదుగా జరిగే వ్యవహరంగా చెబుతున్న ఈ విషయంలోకి వెళితే..

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామం ఆసక్తికర పరిణామానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఫిబ్రవరి 9న చింతపర్రు సర్పంచ్ పదవితో పాటు.. గ్రామంలోని వార్డు పదవులకు ఎన్నికలు జరిగాయి. గ్రామానికి చెందిన పెనుమత్స వెంకట రామకృష్ణంరాజు 4.. 5 వార్డుల బరిలో దిగారు. పోటాపోటీగా సాగిన ఈ ఎన్నికల్లో ఆయన 44... 38 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. అంతేనా.. ఈ జంట గెలుపు తర్వాత పరోక్ష పద్దతిలో జరిగే ఉప సర్పంచ్ ఎన్నికల్లో పోటీ పడి.. అక్కడా గెలిచారు.

అనూహ్యంగా ఆయన గెలుచుకున్న అన్ని పదవుల్ని ఆయన కోల్పోయారు. దీనికి కారణం ఆయన మీద నమోదైన ఫిర్యాదేనని చెబుతున్నారు. ఎన్నికల్లో గెలుపు సూత్రాన్ని పట్టుకున్న పెద్ద మనిషి.. ఎన్నికల నిబంధనల్ని తెలుసుకునే విషయంలో తప్పులో కాలేశారు. పంచాయితీ ఎన్నిల నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానానికి మించి పోటీ చేయకూడదు. ఈ రూల్ గురించి తెలీదేమో కానీ.. రామకృష్ణంరాజు రెండు స్థానాల్లో పోటీ చేయటంతో ఆయనపై వేటు పడింది.

ఎన్నికల నిబంధనావళి రూల్ నెంబరు 8(3) ప్రకారం.. ఒక అభ్యర్థి ఒక చోట కంటే ఎక్కువ చోట్ల నామినేషన్లు దాఖలు చేసిన పక్షంలో నామినేషన్ల ఉపసంహరణ తేదీ నాటికి ఏదో ఒక చోట తప్పించి మిగిలిన చోట్ల ఉపసంహరించుకోవాలన్న పాయింట్ ఆయనకు తెలీకపోవటంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. అలా కాని పక్షంలో సదరు అభ్యర్థి దాఖలు చేసిన అన్ని నామినేషన్లు రద్దు అవుతాయి.

రామకృష్ణంరాజు సంగతి సరే.. కనీసం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఏమైంది? ఆయనకు మాత్రం తెలీదా? అంటే తెలీదనే చెబుతన్నారు. ఆయన గెలుపుపై ఆయన ప్రత్యర్థులు ఫిర్యాదు చేయటంతో.. విచారణ జరిపిన అధికారులు ఆయన ఎన్నిక చెల్లదని తేల్చారు. దీంతో.. రెండు వార్డుల ఎన్నికతో పాటు.. ఉప సర్పంచ్ ఎన్నికనూ రద్దు చేశారు. అంతేకాదు.. ఈ ఇష్యూలో రిటర్నింగ్ అధికారిపై కూడా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో చింతపర్రు గ్రామ పంచాయితీలోని ఎన్నిక రద్దు చేసిన రెండు స్థానాలకు మరోసారి ఎన్నిక నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మరోసారి రెండుచోట్ల నామినేషన్ వేశారు రామకృష్ణంరాజు. గతంలో మాదిరి కాకుండా ఈసారి నామినేషన్ ఉపసంహరణ సమయానికి ఏదో ఒక చోట్ తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటానని చెబుతున్నారు.