Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్ తీసుకున్న నిర్ణయంపై మున్సిపల్ అధికారుల భారీ జరిమానా..

By:  Tupaki Desk   |   1 Oct 2021 2:30 AM GMT
ఇన్ఫోసిస్ తీసుకున్న నిర్ణయంపై మున్సిపల్ అధికారుల భారీ జరిమానా..
X
ఐటీ కంపెనీల్లో జాబ్ రావడం అంటే పెద్ద వరంగా భావిస్తారు. ఒక్కసారి ఇలాంటి సంస్థల్లో జాబ్ వస్తే చాలు.. ఇక జీవితం ధన్యమైపోయినట్లు భావిస్తారు. ఎందుకంటే చాలా ఐటీ కంపెనీలో తమ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా చూసుకుంటాయి. భారీ జీతంతో పాటు అదనపై నజరానాలు, ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తూ ప్రోత్సహిస్తాయి. దీంతో అనతి కాలంలోనే ఐటీ కంపెనీలో జాబ్ చేసేవారు ఉన్నత స్థాయికి వెళ్లిన వారున్నారు. అయితే సాఫ్ట్ వేర్ కంపెనీల్లో దిగ్గజంగా పేరు తెచ్చుకున్న ఇన్షోసిస్ గురించి తెలియని వారుండరు. ఈ కంపెనీలో జాబ్ కోసం చాలా మంది నిద్రల్లేకుండా ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటీవల కంపెనీకి చెందిన హైదరాబాద్లోని సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అంతేకాకుండా సంస్థ ప్రతినిధులు చేసిన ఓ పనికి మున్సిపల్ అధికారులు కూడా భారీ జరిమానా విధించారు.

ఇన్ఫోసిస్ కంపెనీకి దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో బ్రాంచీలు ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్లోనూ బ్రాంచ్ ఏర్పాటు చేసింది. పోచారంలో ఉన్న ఈ సంస్థలో చాలా మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. అయితే ఇటీవల సంస్థ ఓ నిర్ణయం తీసుకుంది. సంస్థకు వచ్చే ఉద్యోగుల వద్ద నుంచి పార్కింగ్ ఫీజును వసూలు చేయడం మొదలు పెట్టారు. టూ వీలర్ తెచ్చుకునేవారికి 250 నుంచి 300 రూపాయలు, కార్లు తీసుకొచ్చే వారికి రూ. 500 పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. అయితే ఉద్యోగులు చేసేదేమీ లేక పార్కింగ్ ఫీజు ఎక్కువైనా చెల్లిస్తున్నారు.

అయితే గోపాల్ అనే ఓ సామాజిక కార్యకర్తకు ఈ విషయం తెలియడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇన్ఫోసిస్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఇన్ఫోసిస్ కు షోకాజ్ నోటీసులు పంపించింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని తెలిపింది. అయితే సంస్థ ప్రతినిధులు హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ‘ తమ ఉద్యోగులను వ్యక్తిగత వాహనాల నుంచి పబ్లిక్ వాహనాల వైపు మళ్లించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వ్యక్తిగత వాహనాల వల్ల కాలుష్యం పెరిగిపోతుందని, అంతేకాకుండా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందని తెలిపారు. ఇలా భారీగా ఫీజులు వసూలు చేయడం ద్వారా ఉద్యోగులు పబ్లిక్ వాహనాల వైపు మరలుతారని’ తెలిపారు.

అయితే పార్కింగ్ ఫీజు వసూలు చేయడంపై హైదరాబాద్ మున్నిపాలిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై స్థానిక మున్సిపల్ అధికారులు ఇన్ఫోసిస్ పై కొరఢా ఝులిపించారు. తెలంగాణ స్టేట్ అపార్ట్ మెంట్ చట్టం ప్రకారం ఉద్యోగుల నుంచి పార్కింగ్ ఫీజును వసూలు చేయొద్దు. కానీ ఇన్ఫోసిస్ భారీగా ఫీజును వసూలు చేసింది. దీంతో సంస్థపై మున్సిపల్ అధికారులు ఫైన్ విధించారు. రూ.50 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇన్ఫోసిన్ సంస్థ మారు మాట్లాడకుండా 50 వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.

దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఇన్ఫోసిస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైతే బ్యాటరీ వాహనాలు వాడమని చెప్పాలని, అంతేకాని ఇలా ఉద్యోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అయితే తమ ఉద్దేశం అది కాదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నా సోషల్ మీడియాలో మాత్రం విమర్శల పరంపర సాగుతోంది. ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటామని సంస్థ ప్రతినిధులు చెబుతూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.