Begin typing your search above and press return to search.

ఉప ఎన్నిక వ‌చ్చింది కాబ‌ట్టే.. గిరిజ‌నులు గుర్తొచ్చారే.. కాంగ్రెస్‌పై మునుగోడు జ‌నం స‌టైర్లు!

By:  Tupaki Desk   |   26 Sep 2022 3:50 AM GMT
ఉప ఎన్నిక వ‌చ్చింది కాబ‌ట్టే.. గిరిజ‌నులు గుర్తొచ్చారే.. కాంగ్రెస్‌పై మునుగోడు జ‌నం స‌టైర్లు!
X
మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా షెడ్యూల్ విడుద‌ల కాక‌పోయినా.. రాజ‌కీయం మాత్రం గ‌రంగరంగా సాగుతోంది. అధికార పార్టీ పై ఏదో ఒక విధంగా విజ‌యం ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు.. చేస్తున్నాయి పార్టీలు. ముఖ్యంగా త‌న సిట్టింగ్ సీటును ద‌క్కించు కునేందుకు కాంగ్రెస్ బాగానే క‌ష్ట‌ప‌డుతోంది. అయితే.. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లపై జ‌నాలు న‌వ్విపోతున్నారు. ఎందుకంటే.. మునుగోడులో గిరిజ‌నులు ఎదుర్కొంటున్న పోడు భూముల స‌మ‌స్య ఇప్ప‌టిది కాదు. ఎన్నో ద‌శాబ్దాలుగా ఉంది. అయితే.. దీనిని ప‌రిష్క‌రించేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు.

ముఖ్యంగా ఉమ్మ‌డి రాష్ట్రంలో కొన్ని ద‌శాబ్దాల పాటు పాల‌న చేసిన కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఇక్క‌డ వ‌రుస పెట్టి విజ‌యాలు సాదించిన వారు కానీ.. ఏనాడూ ఈ స‌మ‌స్యపై దృష్టి పెట్టింది లేదు. అదే జ‌రిగి ఉంటే.. నేడు ఇక్క‌డి గిరిజ‌నులు.. ఎంతో సంతోషంగా ఉండేవారు. కానీ,ఇప్ప‌టికీ.. పోడు భూముల స‌మ‌స్య‌.. వారిని ద‌శాబ్దాలుగా వేదిస్తూనే ఉంది.

అయితే.. ఇప్పుడు మ‌రోసారి ఈ విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. తాజాగా మునుగోడు ఉప పోరు నేప‌థ్యంలో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేస్తున్న పాల్వాయి స్ర‌వంతిని గెలిపిస్తే.. తాము పోడు భూముల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని.. కాంగ్రెస్ చీఫ్‌.. రేవంత్ ప్ర‌క‌టించారు.

అంటే.. స్ర‌వంతిని గెలిపిస్తేనే.. మా స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తారా? గ‌తంలో గెలిపించిన కాంగ్రెస్ నాయ‌కులు మాకు ఏం చేశారు? అని ఇక్క‌డి గిరిజ‌నులు ప్ర‌శ్నిస్తున్నారు. కాంగ్రెస్ త‌న బుద్ధిని మార్చుకోవ‌డం లేద‌ని.. ఎన్నిక‌లు వ‌స్తే.. ఒక‌ర‌కంగా.. అయిపోగానే ఒక‌ర‌కంగా.. ప్ర‌జ‌ల‌తో ఆడుకుంటోంద‌ని అంటున్నారు. ''పోడు స‌మ‌స్య ఇప్ప‌టిది కాదు. కేసీఆర్ స‌ర్ ప్ర‌భుత్వంలో వ‌చ్చిందేమీ కాదు. ఇది.. కొన్ని ద‌శాబ్దాలుగా మేం ఎదుర్కొంటున్నాం. గ‌తంలో కాంగ్రెస్ ఉన్న‌ప్పుడు కూడా అనేక హామీలు ఇచ్చారు. ఒక్క‌టంటే ఒక్కటీ నెర‌వేర్చ‌లేదు. ఇప్పుడు ఎలా న‌మ్ముతాం'' అని గిరిజ‌నులు ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌రికొంద‌రు ఇదే విష‌యంపై లాజిక్ లాగుతున్నారు. ''పోడుకు ఆశ‌ప‌డి స్ర‌వంతిని గెలిపిస్తే.. ఏం చేస్తుంది? ఆమె నాయ‌న వ‌ల్లే కాలేదు. ఏదైనా ఉంటే.. కేసీఆర్ సారే చేయాలి! '' అని మ‌రికొంద‌రు అంటున్నారు.

ఏదేమైనా.. కీల‌క‌మైన ఎన్నిక‌ల్లో అత్యంత కీల‌క‌మైన పోడు స‌మ‌స్య‌ను లేవ‌నెత్తిన కాంగ్రెస్‌కు ఇప్పుడు గిరిజ‌నుల నుంచి ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌ల‌తో రెండుచెంప‌లు వాయించుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతే క‌దా!!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.