Begin typing your search above and press return to search.

మునుగోడు అద్భుత విజయమైతే.. ప్రెస్ మీట్ కు కేసీఆర్ రాలేదేంటి?

By:  Tupaki Desk   |   7 Nov 2022 5:13 AM GMT
మునుగోడు అద్భుత విజయమైతే.. ప్రెస్ మీట్ కు కేసీఆర్ రాలేదేంటి?
X
అద్భుత విజయం.. ముందే చెప్పేసిన గెలుపు.. హ్యాట్రిక్ విజయాన్ని స్పష్టంగా చెప్పేసిన వైనం.. ఇలా చాలానే చెప్పేస్తున్నారు గులాబీ నేతలు మునుగోడు గెలుపు మీద. యావత్ పార్టీ మొత్తం.. చివరకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మొదలు.. ఆయన తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా ఉన్న కేటీఆర్.. ట్రబుల్ షూటర్ హరీశ్.. ఇలా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరు కలిసి కిందా మీదా పడితే మునుగోడు మెజార్టీ 10వేలకు వచ్చి చేరింది.మరింత కరెక్టుగా చెప్పాలంటే 10,309 ఓట్లు.

ఈ విజయం అంత ఈజీగా రాలేదన్న విషయం తెలిసిందే. 93 శాతం ఓట్లు పోలైన ఎన్నికల్లో పోలైన ఓట్లలో మెజార్టీ 4.5 శాతమే కావటం చూస్తే.. ఎన్నిక ఫలితం ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ బింకం తగ్గకుండా.. తమకు లభించింది అద్భుత విజయం అంటూ సంబరాలు చేసుకుంటున్న తీరు ఒక ఎత్తు అయితే.. ఇదే మాటల్ని తెలంగాణ భవన్ లో నిర్వహించిన సంబరాల్లో మంత్రి కేటీఆర్ నోటి నుంచి ఇలాంటి మాటలే రావటం గమనార్హం.

మునుగోడు ప్రజలు బీజేపీ అభ్యర్థికి కర్ర కాల్చి వాత పెట్టినట్లు కేటీఆర్ వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికను సాపేక్షంగా చూసినప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. అందరూ చెబుతున్నట్లుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరి తెచ్చుకున్న ఉపద్రవంగా భావించాల్సిన అవసరం లేదని.. ఇంత తీవ్రమైన పోటీలోనూ.. తన సత్తా ఏమిటో చాటారని చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని.. 84 మంది ఎమ్మెల్యేలు.. పదహారు మంది మంత్రుల్ని మొహరించిన ఒక ఉప ఎన్నికలో స్వల్ప మెజార్టీకే పరిమితం కావటం అంత తేలికైన విషయం కాదు.

ఓట్ల లెక్కల్లో.. అంకెల్లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయి ఉండొచ్చు. కానీ.. ఆయన ఓటమి వెనుక కారణాలు ఏమిటన్నది అందరికి తెలిసిందే. కాబట్టి ఆయన ఓటమిని ఎక్కువగా చెప్పుకోవటానికి లేదు. అదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపును ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

మునుగోడు ఉప పోరులో అద్భుత విజయమని చంకలు గుద్దుకుంటున్న గులాబీ దళానికి బిన్నంగా గులాబీ బాస్ తీరు ఉందంటున్నారు. సాధారణంగా అనూహ్య విజయాన్ని సాధించినప్పుడు.. అత్యంత ఆనందకరమైన సందర్భాల్లోనూ గులాబీ బాస్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడటం జరుగుతుంది.

అందుకు భిన్నంగా తాజాగా మాత్రం కేసీఆర్ కనిపించకుండా ఉండటం గమనార్హం. గులాబీ బాస్ మైండ్ సెట్ తెలిసిన వారంతా.. మునుగోడు ఉప ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ విషయంలో ఆయన డిస్ట్రబ్ అయ్యారని అంటున్నారు. తాను పక్కాగా సిద్ధం చేసిన వ్యూహాన్ని అమలు చేసే విషయంలో తాను నమ్ముకున్న వారు సరిగా పని చేయలేదన్నట్లుగా వాదన వినిపిస్తోంది. ఈ కారణంతోనే తెలంగాణ భవన్ లో నిర్వహించిన వేడుకలు.. మీడియా సమావేశానికి ముఖ్యమంత్రి హాజరు కాకుండా.. తనకు బదులుగా తన వారసుడ్ని పంపి.. ఆయనతో స్టేట్ మెంట్ ఇప్పించారన్నమాట వినిపిస్తోంది. లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక. కాదంటారా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.