Begin typing your search above and press return to search.

మునుగోడు ఉప ఎన్నిక అప్పుడేనా?

By:  Tupaki Desk   |   10 Aug 2022 4:19 AM GMT
మునుగోడు ఉప ఎన్నిక అప్పుడేనా?
X
ఉప ఎన్నికలతో పార్టీని పైకి తీసుకెళ్లిన రాజకీయ పార్టీ అధినేత ఎవరైనా ఉన్నారంటే అది గులాబీ బాస్ కేసీఆర్ మాత్రమేనని చెప్పాలి. మరే రాజకీయ అధినేత చేయని విధంగా ఆయన చేశారని చెప్పాలి. సాధారణంగా విపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ.. అది కూడా అంతంత మాత్రమే ప్రజా బలం ఉన్న పార్టీ.. ఉప ఎన్నికను ఎదుర్కొనటమేకాదు.. దాన్నో ఆయుధంగా మార్చుకొని తన ఉద్యమాన్ని నిర్మించిన విషయంలో కేసీఆర్ ను అభినందించక తప్పదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మిగిలిన అంశాల సంగతి ఎలా ఉన్నా.. ఉప ఎన్నికలు ప్లే చేసిన రోల్ ను మాత్రం తక్కువ చేయలేం.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇవాల్టి రోజున తిరుగులేని అధికారాన్ని చేతిలో ఉంచుకున్న టీఆర్ఎస్.. ఏ ఉప ఎన్నికలతో తాను ఎదిగానో.. ఇప్పుడు అవే ఉప ఎన్నికలతో సవాలుగా మారి.. తన రాజకీయ పలుకుబడిని ప్రశ్నించేలా మారటం గమనార్హం. తాజాగా మరో ఉప ఎన్నికకు తెలంగాణలో తెర లేచిన సంగతి తెలిసిందే. నిజానికి ఇప్పుడు వచ్చిన ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు ఏ మాత్రం సంబంధం లేనిది. ఎందుకంటే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు.

కాంగ్రెస్ ను వదిలేసి బీజేపీలో చేరిన నేపథ్యంలో.. ఈ ఎమ్మెల్యే సీటు కోసం ఆ రెండు పార్టీలు కొట్లాడుకునే పరిస్థితి. అయితే.. అనుకోని రీతిలో వచ్చిన ఈ ఉప ఎన్నిక.. ఇప్పుడు టీఆర్ఎస్ కు ఒక సవాలుగా మారటమే కాదు.. తన బలాన్ని.. అధిక్యతను నిరూపించుకోవటానికి ఉన్న అవకాశంగా మారిందని చెప్పాలి. తెలంగాణలో టీఆర్ఎస్ బలం తగ్గుతుందని.. బీజేపీ బలం పెరుగుతుందన్న అభిప్రాయాలు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. అందుకు భిన్నంగా తనకు తిరుగులేని అధిక్యత తెలంగాణలో ఉందన్న విషయాన్ని స్పష్టం చేయటానికి మునుగోడు ఉప ఎన్నిక ఒక చక్కటి అవకాశంగా భావిస్తున్నారు.

అందుకే.. ఇప్పటివరకు ఉప ఎన్నికల్లో అనుసరించిన విధానానికి భిన్నంగా మునుగోడు విషయంలో వ్యవహరించాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్లుగా ఇటీవల కాలంలో ఆ పార్టీ చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన స్పీకర్.. అనంతరం విడుదల చేసిన నోటిఫికేషన్ తో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. తనకు సంబంధం లేని సీటును తన సొంతం చేసుకుంటే ఆ లెక్కనే వేరుగా ఉంటుందన్న ఆలోచనలో ఉన్న గులాబీ బాస్.. ఆ దిశగా అడుగులు వేయటం షురూ చేశారని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్న మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరిగే అవకాశం ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకిలా అంటే.. ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్నది అంటే.. దానికి తగ్గట్లు ప్రణాళికను సిద్ధం చేసుకోవటానికి సాయం చేస్తోంది. ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ తాజాగా వేసుకుంటున్న అంచనాల్ని చూస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగే పరిస్థితి లేదని చెబుతున్నారు. అధికార పార్టీ అంచనాల్లో అక్టోబరు.. నవంబర్ లో మాత్రమే ఉప ఎన్నిక జరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది.

అంటే.. మరో రెండున్నర నెలలు నుంచి మూడు నెలల వరకు సమయం ఉన్నట్లుగా భావిస్తోంది. ఎవరైనా ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేస్తే.. ఆర్నెల్ల వ్యవధిలో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. అందుకు ఎన్నికల్ని నిర్వహించటం నిబంధనగా ఉన్న విషయం తెలిసిందే. వాస్తవానికి 2014లో మునుగోడు సీటు టీఆర్ఎస్ కైవశం చేసుకుంది. అనూహ్యంగా 2018లో జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ సొంతమైంది. దీంతో.. తమకు చెందిన సీటును కాంగ్రెస్ హస్తగతం చేసుకున్న నేపథ్యంలో.. తిరిగి తన అధిక్యను ప్రదర్శించాలని టీఆర్ఎస్ తపిస్తోంది.

అందుకే.. అభ్యర్థి విషయంలో హడావుడి పడకుండా.. అన్నిలెక్కలు వేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమిని సరిగా విశ్లేషించుకోవటం ద్వారా.. మునుగోడులో పార్టీ జెండా రెప రెపలాడేలా చేయొచ్చన్న నమ్మకంతో ఉంది. అందుకే.. హడావుడికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎక్కడా తప్పులు జరగకూడదన్న భావనలో పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు. మాటలు అనుకోవటం వేరు.. చేతల్లో చూపించటం వేరు. ఆ విషయంలో టీఆర్ఎస్ ఏం చేయాలనుకుంది? ఏం చేసింది? అన్నది మునుగోడు ఫలితంతో చెప్పేయొచ్చు. కాకుంటే.. అందుకు మరికొంత సమయం పడుతుందంతే.