Begin typing your search above and press return to search.

విలీనం వెనుక చిన్న‌మ్మే..సెల్వం టీం ఆరోప‌ణ‌

By:  Tupaki Desk   |   20 April 2017 2:14 PM GMT
విలీనం వెనుక చిన్న‌మ్మే..సెల్వం టీం ఆరోప‌ణ‌
X
త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకేలో నెల‌కొన్న ప‌రిణామాలు మ‌రో మ‌లుపు తిరిగాయి. అన్నాడీఎంకే భ‌వితవ్యం రీత్యా ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి వ‌ర్గం- మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం ఒక్క‌ట‌వుతున్నాయ‌ని అంతా భావించిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనికి తాజాగా సెల్వం టీం బ్రేక్ వేసింది. ఈ విలీనం స్కెచ్చును న‌డిపిస్తోంది చిన్న‌మ్మే అంటూ ఆరోపించింది. ప‌న్నీర్ సెల్వం వ‌ర్గంలోని కీల‌క నేత అయిన మునుస్వామి ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మ‌న్నార్ గుడి మాఫియాలో కీల‌క వ్య‌క్తులు అయిన శశికళ - దినకరన్‌ ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ముఖ్య‌మంత్రి పళనిస్వామి వర్గం అధికారికంగా ప్రకటన చేయాలని మునుస్వామి డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే నేత‌ల సంక్షేమం రీత్యా తాము శశికళను - దినకరన్‌ లను పార్టీ నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నామని చెప్పారు. కానీ పళని వర్గం నేతల వ్యాఖ్యలు చూస్తుంటే బెంగళూరు జైలులో ఉన్న శశికళ విలీన‌ వ్యవహారాన్ని నడిపిస్తున్న‌ట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అందుకే శశికళ, దినకరన్‌ ను పార్టీ నుంచి అధికారంగా బహిష్కరించాల‌ని డిమాండ్ చేశారు. అమ్మ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నామని, దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డక‌పోవ‌డం త‌మ సందేహాల‌కు ఆస్కారంగా మారింద‌ని తెలిపారు. త‌మ డిమాండ్ల విష‌యంలో ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి సానుకూలంగా స్పందిస్తేనే ఇరువర్గాల విలీనం సాధ్యమవుతుందని, వారు అధికారికంగా రాజీనామా చేయాలని మునుస్వామి తేల్చి చెప్పారు. కాగా, కోటిన్నర మంది అన్నాడీఎంకే కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలని కోరుకుంటున్నారని మునుస్వామి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌తిపాద‌న పెట్టారు.

ఈ నేప‌థ్యంలో కీల‌క అంశాల విష‌యంలో ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం త‌మ ప‌ట్టును కొన‌సాగిస్తుండటంతో విలీన ప్ర‌క్రియ విఫలమైనట్లుగా కనిపిస్తోంది. సెల్వం వ‌ర్గం తమ అన్ని డిమాండ్లు నెరవేరుస్తేనే చర్చలు ముందుకు వెళ్తాయని అంటున్న నేప‌థ్యంలో ఇప్పుడు బాల్ ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి కోర్టులో ఉంద‌ని....ఆయ‌న తీసుకునే నిర్ణ‌యం ఆధారంగానే విలీనం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/