Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కు కామ్రేడ్ మామూలు షాకివ్వ‌లేదుగా?

By:  Tupaki Desk   |   10 July 2019 10:47 AM GMT
ప‌వ‌న్ కు కామ్రేడ్ మామూలు షాకివ్వ‌లేదుగా?
X
ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు.. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కామ్రేడ్స్ తో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ భుజం భుజం రాసుకుపూసుకు తిరిగ‌టం తెలిసిందే. అవుట్ డేటెడ్ క‌మ్యూనిస్టుల‌ను వెంట పెట్టుకొని తిర‌గటం ద్వారా ప్ర‌యోజ‌నం పొందింది శూన్యం. ఎప్ప‌టిక‌ప్పుడు.. ఎవ‌రో ఒక‌రితో పొత్తు పెట్టుకోవ‌టం ద్వారా త‌మ‌ను తాము తోక పార్టీలుగా మార్చుకున్న క‌మ్యునిస్టులు ప‌వ‌న్ మీద భారీ ఆశ‌లే పెట్టుకున్న‌ట్లు చెబుతారు.

ప్ర‌జ‌ల్లో ప‌వ‌న్ కున్న మాస్ ఇమేజ్ కార‌ణంగా తమ‌కు లాభం జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేసుకున్నా.. అలాంటిదేమీ లేకుండా పోయిన‌ట్లుగా చెప్ప క‌త‌ప్ప‌దు. ప‌వ‌న్ కార‌ణంగా క‌మ్యునిస్టుల‌కు.. వామ‌ప‌క్షాల కార‌ణంగా ప‌వ‌న్ కు ఒరిగిందేమీ లేదు. ప‌వ‌న్ తో ప్ర‌యాణం ఇక చాల్లే అనుకున్నారో ఏమో కానీ.. తాజాగా సీపీఐ రాష్ట్ర స‌హాయ కార్య‌ద‌ర్శి ముప్పాళ్ల నాగేశ్వ‌ర‌రావు నోటి నుంచి ఊహించ‌ని రీతిలో కామెంట్ చేశారు. ఇంత‌కీ ఆయ నోటి నుంచి వ‌చ్చిన కామెంట్ ఏమంటే.. ప‌వ‌న్ పోటీకి దిగిన గాజువాక‌.. భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌లేద‌ని.. అదే స‌మ‌యంలో బాబు బ‌రిలో దిగిన కుప్పంలోనూ.. చిన‌బాబు బ‌రిలోకి దిగిన మంగ‌ళ‌గిరిలోనూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారం చేయ‌ని విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఈ కార‌ణంగానే ప్ర‌జ‌లు జ‌న‌సేన కూట‌మితో పాటు టీడీపీని న‌మ్మ‌లేద‌న్న మాట ఆయ‌న నోటి నుంచి వ‌చ్చింది. కామ్రేడ్ తాజా మాట చూస్తే.. బాబు.. ప‌వ‌న్ ల మ‌ధ్య నీకిది.. నాకిది అన్న‌ట్లుగా తెర వెనుక ఒప్పందం జ‌రిగింద‌న్న అభిప్రాయం క‌లిగేలా తాజా వ్యాఖ్య ఉందంటున్నారు. మ‌రి..దీనికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఎలాంటి స‌మాధానం ఇస్తారో చూడాలి.