Begin typing your search above and press return to search.

బీజేపీని రెచ్చగొట్టిన మురళీమోహన్

By:  Tupaki Desk   |   22 March 2016 6:26 AM GMT
బీజేపీని రెచ్చగొట్టిన మురళీమోహన్
X
పేరుకు మిత్రపక్షాలైనా కూడా క్షేత్ర స్థాయిలో అలాంటి పరిస్థితి లేని టీడీపీ - బీజేపీల మధ్య పైస్థాయిలోనూ యుద్ధం మొదలవబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో టీడీపీపై బీజేపీ నేతలు కొందరు గ్యాప్ ఇవ్వకుండా నిత్యం తీవ్ర విమర్శలు చేస్తున్నా టీడీపీ నుంచిమాత్రం ఎదురుదాడి ఉండడం లేదు. చంద్రబాబు వద్దని చెప్పడమే అందుకు కారణం. కేంద్రంతో ఉన్న అవసరాల నేపథ్యంలో చంద్రబాబు తన పార్టీ నేతలను నిలువరిస్తున్నారు. అయితే.. ఎంత మంచిగా ఉన్నా కూడా వర్కవుట్ కాకపోవడంతో ఆయన కూడా ఇటీవల మెల్లమెల్లగా దూకుడు పెంచుతున్నారు. కేంద్రం తన హామీలు నిలబెట్టుకోవాలంటూ ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం దానికి తొలిమెట్టు అని చెప్పుకోవాలి. అదేసమయంలో భాజపాతో రాజకీయ ఆట మొదలు పెట్టాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుకు సన్నిహితుడు - రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణగా ఛెప్పుకోవాలి... తాజాగా ఆయన బీజేపీ మనసులోని కోరిక తీరదంటూ కాస్త రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఏపీలో అదికారంలోకి రావాలని బీజేపీ కంటున్న కలలు తీరబోవని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బిజెపికి అధికారం అంత సులువుగా రాదని ఎంపీ మురళీమోహన్‌ అన్నారు. ఏపీలో స్వంతంగా అధికారంలోకి రావడానికి బిజెపి ప్రయత్నిస్తోందని అన్న ఆయన... కేంద్రం విధానాల కారణంగా ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ లేదన్నట్లుగా అన్యాపదేశంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా ఇచ్చే అంశం చట్టంలో పెట్టకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. అయితే.. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం చెప్పడం లేదని మురళీ మోహన్ అంటున్నారు. మీ ప్లానేంటో మాకు తెలుసులే అన్నట్లుగా బీజేపీని ఉద్దేశించి మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాకపోవచ్చని.. పార్టీ ఆదేశాలతోనే ఆయన ఆ మాట అని ఉంటారని అంటున్నారు.