Begin typing your search above and press return to search.

రాజమండ్రి సీటు.. తిరిగి వారికే..

By:  Tupaki Desk   |   16 March 2019 6:05 AM GMT
రాజమండ్రి సీటు.. తిరిగి వారికే..
X
రాజమండ్రి టీడీపీ సిట్టింగ్ ఎంపీ మురళీ మోహన్ ఎప్పుడైతే తాను ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించాడో అప్పటి నుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. రాజమండ్రి బరిలో దిగే టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరనే దానిపై విశ్లేషణలు కొనసాగాయి. కొత్త కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. మురళీ మోహన్ తాను పోటీచేయనని.. తన కుటుంబ సభ్యులను సైతం బరిలోకి దించనని స్పష్టం చేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించారు.

విశాఖ ఎంపీ సీటును కోరిన బాలయ్య చిన్నల్లుడు భరత్ ను ఒకనొక దశలో రాజమండ్రి ఎంపీ సీటు నుంచి బరిలోకి దించుతారని ప్రచారం కూడా సాగింది. ఇక చాలా మంది పేర్లు టీడీపీలో తెరపైకి వచ్చాయి. కానీ చివరకు చంద్రబాబు మళ్లీ మురళీ మోహన్ కుటుంబానికే టికెట్ ను కేటాయించినట్లు తెలిసింది. ఆరంభంలో వినిపించిన మురళీ మోహన్ కోడలు రూప పేరునే ఖాయం చేసినట్లు సమాచారం.

రాజమండ్రి బరి ఆది నుంచి ఆసక్తి రేపుతోంది. ఎంతో కీలకమైన ఈ సీటు విషయంలో మురళీ మోహన్ ఆసక్తి చూపలేదు. ఇక జనసేన నుంచి బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన ఆకుల సత్యనారాయణను రంగంలోకి దించారు. ఆయనకు గెలుపు అవకాశాలున్నాయని సమాచారం. ఇక వైసీపీ అభ్యర్థిని ఇంకా తేల్చలేదు.

వైసీపీ తరుఫున కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతను నిలబెడితే.. టీడీపీ కూడా కమ్మ కావడంతో ఓట్లు చీలి కాపు సామాజికవర్గ జనసేన అభ్యర్థి ఆకుల సత్యనారాయణ గెలుపు సులభం అవుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అదే వైసీపీ కూడా కాపు సామాజికవర్గ నేతకు టికెట్ ఇస్తే.. జనసేన - వైసీపీ అభ్యర్థుల మధ్య ఓట్లు చీలి టీడీపీకి లాభమవుతుందంటున్నారు. ఇప్పుడు వైసీపీ అభ్యర్థి ప్రకటన మీదనే రాజమండ్రి ఎంపీగా ఎవరు గెలిస్తారనేది తేలనుందట.

చంద్రబాబు ఈరోజు తిరుమల వేంకటేశ్వరుడిని సందర్శించి తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా మురళీ మోహన్ కోడలు ‘రూప’ను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.