Begin typing your search above and press return to search.

రాజమండ్రి పోటీ.. కొత్త పేర్లు తెరపైకి..

By:  Tupaki Desk   |   10 March 2019 7:26 AM GMT
రాజమండ్రి పోటీ.. కొత్త పేర్లు తెరపైకి..
X
టీడీపీకి రాజకీయంగా పట్టున్న తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టికెట్‌ పోరు తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా జిల్లాలోని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో పురుషులతోపాటు మహిళలు ఈ సీటును దక్కించుకునేందుకు రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా మురళీమోహన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయన పోటీ చేయనని చెప్పడంతో టికెట్‌ కోసం ఆశించేవారిలో ఆశలు రేకెత్తాయి.

ఈసారి ఎన్నికల్లో మురళీమోహన్‌ పోటీ చేయనని చెప్పడంతో ఆయన కోడలు రూపను బరిలో నిలపాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. రూప కొద్దిరోజులుగా టీడీపీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తోంది. అయితే మరళీ మోహన్ మాత్రం తన కోడలును కూడా పోటీలో నిలబెట్టేందుకు ససేమిరా అంటున్నారు. మరోవైపు తణుకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముళ్లపూడి రేణుక టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె పార్టీ అధినేత బాబును కలిసేందుకు రాజధానికి వెళ్లినట్లు టాక్‌.

రాష్ట్రవ్యాప్తంగా రెండు, లేదా ఒక స్థానాన్ని మహిళలకు కేటాయించాలని టీడీపీ అధినేత ఆలోచిస్తున్నాడట. దీంతో రాజమహేంద్రవరం కచ్చితంగా మహిళకే కేటాయిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ రాజమహేంద్రవరం మహిళకు కేటాయిస్తే తనకే ఇవ్వాలని ముళ్లపూడి రేణుక పట్టుబడుతున్నట్లు టీడీపీ నాయకుల్లో చర్చ సాగుతోంది. దాదాపు 16 సంవత్సరాలు ఆమె టీడీపీలోనే కొనసాగుతున్నారు.పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉండగా టీడీపీ నుంచి మహిళలకు కేటాయించని పక్షంలో తమకు అవకాశం ఇవ్వాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ కోరుతున్నాడట. ఇదివరకు బాబును కలిసి పోటీలో తాను నిలబడతానని, అవకాశం ఇవ్వాలని కోరాడట. మరోవైపు రివర్‌బే అధినేత జాస్తి మూర్తి, శశి అధినేత బూరుగుపల్లి గోపాలకృష్ణలు సైతం టికెట్‌ ఇస్తే పోటీకి సై అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత మదిలో ఏమున్నదోనని నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.