Begin typing your search above and press return to search.

ఈ టీడీపీ ఎంపీ లౌక్యం మామూలుగా లేదు

By:  Tupaki Desk   |   21 May 2016 8:04 AM GMT
ఈ టీడీపీ ఎంపీ లౌక్యం మామూలుగా లేదు
X
రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు - సినీ న‌టుడు మాగంటి మురళీమోహన్ టీడీపీ-బీజేపీ మితృత్వం - ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదాపై పార్టీ శ్రేణుల‌కు ప్ర‌త్యేక హిత‌బోధ చేశారు. కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల సంబంధాలు, త‌మ ఆలోచిన విధానం గురించి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేత‌ల‌కు విశ్లేషించిన తీరు ముర‌ళీమోహ‌న్‌ లోని రాజ‌కీయ నాయ‌కుడిని తెర‌మీద‌కు తెచ్చింద‌ని త‌మ్ముళ్లు అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చెప్తున్నారు.

రాష్ట్ర విభ‌జ‌న మొద‌లుకొని ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు అన్యాయం జరిగిందని ముర‌ళీమోహ‌న్‌ అన్నారు. రాజ్యసభలో విభజన చట్టం గురించి చ‌ర్చిస్తూ అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్ 5 సంవత్సరాలు ప్ర‌త్యేక హోదా ఇస్తామని ప్రతిపాదించగా, బీజేపీ నాయకుడు-ప్ర‌స్తుత కేంద్ర‌మంత్రి వెంకయ్యనాయుడు 10 సంవత్సరాలు కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అయితే బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ విభజన చట్టంలో ఇచ్చిన హామీల‌ను అమలుచేయ‌డంలో పూర్తిగా విఫలమయిందని విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు బీజేపీకి దూరం కావాల‌ని చెప్తున్న‌ప్ప‌టికీ తాము వ్యూహాత్మ‌కంగా కొన‌సాగుతున్నామ‌ని ఎంపీ ముర‌ళీమోహ‌న్‌ చెప్పారు. రాష్ట్రంలోని 29 మంది ఎంపీలు రాజీనామాలు చేసినా కేంద్రంలో బీజేపీ పూర్తి మెజార్టీతో ఉండటంతో హోదా విషయంలో డిమాండ్ చేయలేకపోతున్నామని అన్నారు.

బీజేపీతో గొడవలు పడి క్యాబినేట్ నుండి విడిపోతే బీజేపీకి ఎటువంటి నష్టం లేదని, దేశంలో బీజేపీ ఎంతో బలంగా ఉందని ముర‌ళీమోహ‌న్‌ అన్నారు. బీజేపీ పార్టీతో టీడీపీ ఎంపీలు సఖ్యతతో ఉండి ప్రత్యేకహోదా - ప్రత్యేక నిధులు సాధించాలని అనుకుంటున్నామని చెప్పారు.దేశంలో ప్రత్యేకహోదాలు కలిగిన రాష్ట్రాలు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని ముర‌ళీమోహ‌న్‌ తెలిపారు.

అయిన‌ప్ప‌టికీ ప్రత్యేకహోదా కోసం అందరూ కలిసికట్టుగా పోరాడుతామని తెలిపారు. ఇటీవ‌ల‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసినప్పుడు రాష్ట్రంలో ఎన్నికల హామీల్లో భాగంగా రాయలసీమ నాలుగు జిల్లాలు - ఉత్తరాంధ్ర మూడు జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి కేంద్రం నిధులు ఇస్తామని చెప్పారని, ఆ హామీలను నిలబెట్టుకోవాలని కోరామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు తక్కువగా ఉండటంతో నాబార్డ్ నిధుల ద్వారా 2019 నాటికి పూర్తి చేసేలా హామీ ఇచ్చినట్లు తెలిపారు. విశాఖ రైల్వేజోన్ లేకపోవడంతో ఉద్యోగ అవకాశాలు - ఆదాయం ప్రక్క రాష్ట్రాలకు పోతున్నాయని, వీలైనంత త్వరలో విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని కోరినట్లు చెప్పారు. తూర్పు - పశ్చిమ గోదావరి జిల్లాలను టూరిజం హబ్‌ గా తయారుచేస్తూ దేశవిదేశీ టూరిస్టులను ఆకర్షించే విధంగా ఉభయ గోదావరి జిల్లాలను తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు.