Begin typing your search above and press return to search.

కేటీఆర్ వర్గాన్ని లేపుతూ.. హరీశ్ వర్గాన్ని అణగదొక్కేస్తున్నారు

By:  Tupaki Desk   |   8 Aug 2022 10:02 AM IST
కేటీఆర్ వర్గాన్ని లేపుతూ.. హరీశ్ వర్గాన్ని అణగదొక్కేస్తున్నారు
X
ఎవరు అవునన్నా.. కాదన్నా.. తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ లో వర్గాలు ఉన్నాయన్నది వాస్తవం. యువరాజు కేటీఆర్ తన టీంను ఎప్పుడో ఏర్పాటు చేసుకోవటం.. తన తండ్రి సహకారంతో పార్టీలో తనకు మించిన ‘సూపర్ పవర్’ ఉండకూడదన్న వ్యూహాన్ని ఆచితూచి అన్నట్లుగా అమలు చేయటం.. అందుకు తగ్గట్లే ఫలితాన్ని తన సొంతం చేసుకోవటం తెలిసిందే. ఒక దశ వరకు కేటీఆర్ తో పోటీ పడ్డ హరీశ్.. తర్వాతి కాలంలో తనకున్న పరిమితిని అర్థం చేసుకున్నారని.. ఆ తర్వాత నుంచి వెనకడుగు వేస్తున్నట్లుగా వాపోతుంటారు.

నిజానికి కేసీఆర్ కు చెక్ చెప్పేందుకు..ఆయన మేనల్లుడు హరీశ్ తోనే చెప్పించాలని అమిత్ షా తొలుత అనుకున్నా.. ఆ ప్లాన్ లీక్ కావటం.. హరీశ్ వెనక్కి తగ్గినట్లుగా చెబుతుంటారు. ఇందులో నిజం ఎంతన్నది ప్రశ్నే అయినా.. కొద్ది నెలల పాటు కేసీఆర్ సొంత మీడియాలో హరీశ్ ఫోటో కానీ వార్త కానీ రాని పరిస్థితి. అయితే.. ఆ తర్వాత హరీశ్ అవసరం రావటంతో ఆయన ఫోటోల్ని వాడటం మొదలు పెట్టారు. ఇలాంటి ఉదంతాలు గులాబీ పార్టీలో చాలానే చోటు చేసుకుంటున్నట్లు చెబుతుంటారు. అయితే.. ఆ విషయాల్ని బయటకు చెప్పే సాహసం ఎవరూ చేయరు.

ఇలాంటివేళ.. కేటీఆర్ టీంను పైకి లేపుతూ.. హరీశ్ వర్గాన్ని మొత్తంగా తొక్కేస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ మురళీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నప్పటికీ.. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ లో బీసీలకు న్యాయం జరగటం లేదన్నారు.

అంతేకాదు.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్.. హరీశ్ వెంటే ఉండి.. రాష్ట్ర ఏర్పాటులో పోరాడిన వైనాన్ని గుర్తు చేశారు. టీఆర్ఎస్ లో బీసీలకు న్యాయం జరగటం లేదన్న ఆయన.. అగ్రవర్ణాలకే పదవులన్నీ ఇస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలకే ప్రగతిభవన్ ఎంట్రీ లేనప్పుడు.. తన లాంటి వారు ఎక్కడ మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందన్నారు.

టీఆర్ఎస్ లో కేటీఆర్ వర్గాన్ని పైకి లేపుతున్నారని.. పదవులు అన్ని కూడా ఆయన ఫాలోవర్స్ కు ఇస్తారన్నారు. అదే సమయంలో హరీశ్ వర్గాన్ని తొక్కేస్తున్నారని.. పదవులన్ని పోతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం గుట్టుగా చర్చ జరిగే స్థానే.. ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. మురళీ యాదవ్ మాటలకు గులాబీ నేతలు ఎలాంటి కౌంటర్లు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.