Begin typing your search above and press return to search.

మిత్రులు కూడా అంత మాట అనేస్తున్నారేంటి బాబు..?

By:  Tupaki Desk   |   26 May 2015 8:50 AM GMT
మిత్రులు కూడా అంత మాట అనేస్తున్నారేంటి బాబు..?
X
ఏపీ ముఖ్యమంత్రికి టైం ఏ మాత్రం బాగోలేదన్నట్లుగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడే కాదు.. అధికారంలో లేనప్పుడు కూడా సొంత పార్టీ నేతలు బహిరంగంగా బాబు మీద విమర్శలు చేసే వారు కాదు. తమకున్న బాధ.. ఆవేదనను లోగుట్టుగా తమ సన్నిహితుల వద్ద చెప్పుకునేవారు.

దీనికి భిన్నంగా పదేళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తీరుపై సొంత పార్టీ నేతలు విమర్శలు చేయటం తెలిసిందే. చంద్రబాబు నేతృత్వంలోని సర్కారులో కీలకభూమిక పోషించే ఉప ముఖ్యమంత్రి విమర్శలు చేయటం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి వర్యులే విమర్శలు చేయగా లేంది తాము మాత్రం తక్కువ తిన్నామా అనుకున్నారేమో కానీ.. ఎంపీ.. ఎమ్మెల్యేలు కూడా బాబును విమర్శించేస్తున్నారు.

సొంత పార్టీ నేతలే తమ అధినేతను విమర్శిస్తే.. మిత్రపక్షం విమర్శించటంలో తప్పేం ఉందని అనుకున్నారో కానీ.. తాజాగా బాబుకు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న కమలనాథులు.. ఏపీ రాజధానికి సంబంధించిన అంశంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ.. అందరికి ఆమోదయోగ్యమైన రాజధాని అయితేనే బీజేపీ సాయం చేస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీ రైతుల సమాధుల మీద రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం అంటున్నారు.

రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ రాజధానిని నిర్మించాలని చూస్తే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించదని కొత్త రాగం తీయటం విశేషం. సింగపూర్‌ సర్కారు నుంచి ఏపీ రాజధాని మాస్టర్‌ప్లాన్‌ అందుకున్న సమయంలోనే.. బీజేపీకి చెందిన నేత ఒకరు ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయటం కాస్త ఇబ్బంది పెట్టేవే. మొత్తానికి సొంత పార్టీ నేతలు.. మిత్రపక్షం కూడా బాబు మీద విమర్శలు చేయటం ఏమిటో..?