Begin typing your search above and press return to search.

నాపై కుట్ర జ‌రిగింది...హైకోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్!

By:  Tupaki Desk   |   31 Oct 2018 12:43 PM GMT
నాపై కుట్ర జ‌రిగింది...హైకోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్!
X
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు - ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఎయిర్ పోర్టులో దాడి జ‌రిగినందున అది త‌మ ప‌రిధిలో లేద‌ని - సీఎం చంద్ర‌బాబు చేతులు దులుపుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ త‌ర్వాత విమ‌ర్శ‌లు రావ‌డంతో సిట్ తో విచార‌ణ జ‌రిపిస్తున్నారు. అయితే - ఆ `సిట్` విచార‌ణ మొత్తం...శ్రీ‌నివాస్ చుట్టూనే తిరుగుతోంది కానీ, శ్రీనివాస్ తో ఆ దాడి చేయించిన సూత్ర‌ధారులెవ‌రన్న విష‌యంపై విచార‌ణ జ‌ర‌గ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఈ కేసును కేంద్రం ప‌రిధిలో ఉన్న సంస్థ‌తో విచార‌ణ జ‌రిపించాల‌ని వైసీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ కేసు దర్యాప్తు గురించి హైకోర్టులో బుధ‌వారం నాడు జ‌గ‌న్ పిటిషన్ దాఖ‌లు చేశారు. ఈ కేసులో కుట్రకోణాన్ని ఏపీ పోలీసులు విస్మరించారని - సక్రమంగా విచార‌ణ జరపడంలో ఏపీ సర్కారు విఫలమైందని ఆయన పిటిష‌న్ లో పేర్కొన్నారు. ఈ కేసులో కుట్రకోణంపై సజావుగా దర్యాప్తు జరిపించాలని జగన్‌ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ లో 8 మందిని జగన్‌ ప్రతివాదులుగా చేర్చారు. ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ - ఏపీ డీజీపీ - సిట్‌ ఇన్‌ చార్జి ఏసీపీ - ఎయిర్‌ పోర్టు పీఎస్‌ ఎస్‌ హెచ్‌ వో.. తదితరులతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని కూడా ప్రతివాదిగా చేర్చారు. ఈ రిట్‌ పిటిషన్‌ పై హైకోర్టు గురువారం విచారణను చేపట్టనుంది.

న‌వ్యాంధ్ర ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తెలుసుకునేందుకు తాను ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేప‌ట్టాన‌ని - ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను - చంద్ర‌బాబు అవినీతిని ఎండ‌గ‌డుతున్నాన‌ని తన పిటిషన్‌ లో జ‌గ‌న్ స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలోనే `ఆపరేషన్‌ గరుడ` పేరుతో కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చి - ఏపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్రం ప్లాన్ అంటూ ప్రచారం చేశారని తెలిపారు. టీడీపీ సానుభూతిపరుడైన సినీ నటుడు శివాజీయే `ఆపరేషన్‌ గరుడ` పాత్రధారి అని - పాదయాత్రలో త‌న‌పై దాడి జరుగుతుందని గతంలోనే శివాజీ వెల్ల‌డించార‌ని పిటిష‌న్ లో తెలిపారు. తాజా పరిణామాల‌ను బ‌ట్టి ఇదో భారీ కుట్ర అని - ప్ర‌తిపక్ష నేతను హత్య చేసి `ఆపరేషన్‌ గరుడ`లో భాగంగా చిత్రీక‌రించే ప్రయత్నం జరుగుతోంద‌ని అన్నారు.

అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్ పోర్ట్ లాంజ్‌ లో ఓ వ్యక్తి సెల్ఫీ పేరుతో త‌న ద‌గ్గ‌ర‌కు వచ్చి దాడి చేయబోయాడని జగన్‌ వెల్లడించారు. పదునైన కత్తితో తనపై దాడి చేశాడని - ఆ దాడి నుంచి తాను త్రుటిలో తప్పించుకున్నానని తెలిపారు. ఆ క్ర‌మంలో తాను కిందికి వంగడంతో గొంతుకు తగలాల్సిన కత్తి భుజంలో గుచ్చుకుందని - అందువ‌ల్ల ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. నిందితుడిని భద్రతా సిబ్బంది ... పోలీసులకు అప్పగించారని - ప్రాథమిక చికిత్స త‌ర్వాత తాను హైదరాబాద్‌ వచ్చానని చెప్పారు. హైద‌రాబాద్ లోని సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు త‌న‌కు చికిత్స అందించి.. గాయానికి 9 కుట్లు వేశార‌ని తెలిపారు. త‌న‌పై దాడి జరిగిన గంటలోనే ఏపీ డీజీపీ ప్రెస్‌ మీట్‌ పెట్టార‌ని - పబ్లిసిటీ కోసమే దాడి జరిగిందంటూ దర్యాప్తును నీరుగార్చే ప్రయత్నం చేశార‌ని ఆరోపించారు. .

ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో భాగంగా ఈ `చిన్న` దాడి జ‌రిగింద‌ని చంద్ర‌బాబు చెప్పారని - సీఎం హోదాలో ఉండి బాధ్యతారహితంగా ఆయ‌న ప్రవర్తించారని తెలిపారు. అయితే, త‌న‌పై జరిగింది హత్యాయత్నమేనని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో తేల్చారని - వేర్వేరు చేతిరాతలతో ఉన్న పదిపేజీల లేఖను పోలీసులు విడుదల చేశార‌ని తెలిపారు. దాడి జ‌రిగిన గంటలోపు ఓ ఫ్లెక్సీని తెరపైకి తెచ్చారని - నిందితుడు వైసీపీ అభిమాని అని దుష్ప్ర‌చారం చేశార‌ని చెప్పారు. హత్యాయత్నాన్ని కప్పిపుచ్చేలా సీఎం - డీజీపీల ప్రకటనలు ఉన్నాయని అన్నారు. ఏపీ పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై త‌న‌కు నమ్మకం లేదని - త‌న‌ ప్రాథమిక హక్కులకు భంగం క‌లిగేలా ఏపీ పోలీసుల విచారణ సాగుతోందని అన్నారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధంలేని స్వతంత్ర సంస్థతో ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాల‌ని హైకోర్టుకు జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు.