Begin typing your search above and press return to search.

మోడీకి సోనియా షాక్ ఇచ్చారా?

By:  Tupaki Desk   |   5 Aug 2015 4:57 AM GMT
మోడీకి సోనియా షాక్ ఇచ్చారా?
X
రోజుల తరబడి సభ జరగకుండా అడ్డుకుంటూ.. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న విపక్షాన్ని దారికి తీసుకొచ్చేందుకు మోడీ సర్కారు వేసిన సస్పెన్షన్ అస్త్రాన్ని.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ధీటుగా ఎదుర్కొనటమే కాదు.. మోడీకి షాక్ ఇచ్చేలా చేశారన్న వాదన వినిపిస్తోంది.

ఒకేరోజు తీసుకున్న రెండు నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని ఇచ్చాయన్న వాదన వినిపిస్తోంది. కొద్ది నెలలుగా భూసేకరణ బిల్లు విషయం కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్లకు తలొగ్గేది లేదన్న మోడీ సర్కారు.. అనూహ్యంగా సోమవారం వెనక్కి తగ్గటం.. యూపీఏ సర్కారు తెచ్చిన బిల్లును యథాతథంగా ఓకే చెప్పేయటం కాంగ్రెస్ కు మరింత బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి.

అదే సమయంలో పాతికమంది సభ్యులపై ఐదు రోజుల పాటు విధించిన సస్పెన్షన్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకించటంతోపాటు.. విపక్షాలను సైతం కలుపుకునేలా కాంగ్రెస్ వేసిన ఎత్తులు ఫలించాయి. లోక్ సభలో బీజేపీకి ఉన్న మంది బలాన్ని తక్కువ చేసి చూపాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ తనదైన శైలిలో పావులు కదిపించింది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని తమను తక్కువ అంచనా వేయొద్దని.. ఒకవేళ అలాంటిదే చేస్తే.. అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని చెప్పాలన్న వ్యూహంలో భాగంగానే.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారంటూ పెద్ద పెద్ద మాటల్ని ఉపయోగించినట్లుగా కనిపిస్తోంది.

ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో కాంగ్రెస్ లాంటి పార్టీకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంది బలంతో మోడీ అహంకారంతో ఉన్నారని.. తనకు తిరుగులేన్న ధీమాలో ఉన్నారని భావిస్తున్న విపక్షాల్ని చేరదీసిన కాంగ్రెస్.. తాను పెద్దన్న పాత్ర పోషించేందుకు ముందుకు రావటం.. మోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అధినేత్రి స్వయంగా బయటకు రావటంతో.. మోడీని వ్యతిరేకించే విపక్ష పార్టీలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.

సస్పెన్షన్ వేటు వేయటం ద్వారా కాంగ్రెస్ ను దారికి తెచ్చుకోవాలని మాత్రమే భావించిన కమలనాథులకు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నుంచి వచ్చిన స్పందన ఎంత మాత్రం ఊహించలేనిది. ఒక సస్పెన్షన్ విషయాన్ని ఎంత భారీగా ప్రచారం చేయొచ్చో.. మరెంత పెద్ద రాజకీయ ఆందోళనగా మార్చొచ్చొ.. కాంగ్రెస్ నే మిగిలిన రాజకీయా పార్టీలు చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి.

నిరసనకు స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి.. యువరాజు రంగంలోకి దిగి.. జబ్బలకు నల్ల రిబ్బన్ కట్టుకొని.. ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వాటిల్లిందంటూ విరుచుకుపడిన వైనం.. దానికి మీడియాలో భారీ కవరేజ్ రావటంతో ఖంగుతిన్న కమలనాథులు.. ఐదురోజుల సస్పెన్షన్ ను తగ్గించే ప్రయత్నంలో పడినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా.. చూస్తే.. తాజా సస్పెన్షన్ ఎపిసోడ్ లో మోడీ కంటే సోనియాగాంధీ నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్లుగా కనిపిస్తోంది.