Begin typing your search above and press return to search.

విజయారెడ్డి హత్య లో మంచి రెడ్డి వ‌ర్సెస్ మ‌ల్‌ రెడ్డి

By:  Tupaki Desk   |   6 Nov 2019 4:24 AM GMT
విజయారెడ్డి హత్య లో మంచి రెడ్డి వ‌ర్సెస్ మ‌ల్‌ రెడ్డి
X
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి దారుణ హత్యతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిన విషయం తెలిసిందే. సురేశ్ ముదిరాజ్‌ అనే వ్యక్తి మండల కార్యలయంలోనే విజయారెడ్డి పై పెట్రోల్ పోసి నిప్పటించి హత్య చేశాడు. దాంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. అయితే ఈ హత్యపై విచారణ చేస్తున్న పోలీసులు, హత్య వెనుక గల కారణాలని పరిశీలిస్తున్నారు. ఇక విజయారెడ్డి హత్యకు వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా ఉందా ? రాజకీయ శక్తులు ఏమైనా దాగి ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.

ఈ క్రమంలోనే విజయారెడ్డి హత్య పై అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఆసక్తికరంగా మారాయి. మంచిరెడ్డి వల్లే విజయారెడ్డి హత్య జరిగిందని మల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆరు నెలల కిందట హైదరాబాద్ ఇబ్రహీంపట్నం పరిధిలోని గౌరెల్లి గ్రామస్తులు కొందరు భూసమస్యలు పరిష్కరించాలని, మంచిరెడ్డిని కలిశారని, ఈ సమయంలో 25 లక్షలు చేతులు మారాయని అన్నారు.

అలాగే పాస్ పుస్తకాలు వచ్చాక మిగతా డబ్బులు ఇచ్చేందుకు కొందరు రైతులు మంచిరెడ్డి తో ఒప్పందం చేసుకున్నారని మల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక మల్ రెడ్డి వ్యాఖ్యలని మంచిరెడ్డి తప్పుబడుతున్నారు. మూడుసార్లు ఓడిపోవడంతో, మల్‌రెడ్డి ఆ బాధలో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాకపోతే గౌరెల్లి గ్రామంలో భూసమస్యలు ఉన్న మాట వాస్తవమే అని, ఆ గ్రామానికి చెందిన కొందరిని జాయింట్ కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి మాట్లాడానని, కానీ ఎలాంటి జోక్యం చేసుకో లేదని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే విజయా రెడ్డి హత్య తర్వాత గౌరెల్లి గ్రామస్తులు బయటకు రావడం లేదు. అయితే ఈ హత్యకు సంబంధించిన్ సురేశ్ పాత్ర పైకి కనిపిస్తున్నా...తెర వెనుక ఎవరు ఉన్నారనేది సస్పెన్స్ గా మారింది. పోలీసులు ఆ సస్పెన్స్ కు తెరదించే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఈ హత్య తరవాతే ప్రభుత్వం కూడా భూవివాదాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.