Begin typing your search above and press return to search.

శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. చేతబడి చేస్తున్నాడనే నెపంతో హత్య - ఆపై దహనం!

By:  Tupaki Desk   |   12 Oct 2020 5:30 PM GMT
శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. చేతబడి చేస్తున్నాడనే నెపంతో హత్య - ఆపై దహనం!
X
ప్రపంచం ఆధునికంగా , సాంకేతికంగా ఇంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ , ఇంకా కొన్ని చోట్ల మూఢనమ్మకాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఫలితంగా చేతబడులు ,బాణామతులు జరుగుతున్నాయన్న మూఢ విశ్వాసాలు ప్రాణాలను బలి తీసుకునే దాకా వెళుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో దారుణం చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని కొందరు దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత ఆ మృతుడి ఆనవాళ్లు దొరకకుండా శవాన్ని దహనం చేశారు.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .... శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పుల్లగూడ గిరిజన గ్రామంలో శనివారం అర్థరాత్రి ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్లగూడకు చెందిన ఊలక రమేష్‌ అనే వ్యక్తి పది రోజుల కిందట మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ఊలక నాయకమ్మ చేతబడి చేయడం వల్లే మృతి చెందాడని అనుమానించిన రమేష్‌ బంధువులు మరికొందరితో కలిసి నాయకమ్మను తీవ్రంగా కొట్టారు. తర్వాత ఒడిశాలోని ఓ భూతవైద్యుడిని సంప్రదించి నాయకమ్మ చేతబడి చేశాడని నిర్ధారణకు వచ్చారు.

ఆ తర్వాత గ్రామానికి తిరిగివచ్చి నాయకమ్మను చంపేయాల్సిందిగా అతని కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చారు. వారు ఒప్పుకోకపోవడంతో శనివారం అర్ధరాత్రి నాయకమ్మను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి నోటిలో గుడ్డలు కుక్కి, కాళ్లకు వైరు కట్టి, శ్మశానానికి తీసుకెళ్లి కొట్టి చంపారు. ఆనవాలు దొరక్కూడదని వెంటనే మృతదేహాన్ని దహనం చేశారు. విషయం తెలుసుకున్న పాలకొండ ట్రైనీ డీఎస్పీ ఎం.శ్రీలత, సీఐ చంద్రశేఖర్‌లు ఆదివారం ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు శివకృష్ణ, గంధర్వులు, దుర్గారావు, కరువయ్య, మో హనరావు, కామకృష్ణ, చిన్నారావు, ముఖ లింగం లతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ కాలంలో కూడా చేతబడి చేస్తున్నారనే విశ్వాసాలు ఇంకా గ్రామాలలో ఉండటంపై హేతువాద సంఘాలు మండిపడుతున్నాయి.