Begin typing your search above and press return to search.

జగన్‌ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు: సోము షాక్‌

By:  Tupaki Desk   |   16 Jun 2022 9:30 AM GMT
జగన్‌ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు:  సోము షాక్‌
X
ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌బుత్వాన్ని రాష్ట్ర బీజేపీ నేత‌లు అవ‌కాశం చిక్కిన‌ప్పుడల్లా.. ఉతికి ఆరేస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి పాల‌న చేత‌కావ‌డం లేద‌ని.. రాష్ట్రం అత్యాచారాల దిశ‌గా అడుగులు వేస్తోంద‌ని.. రాష్ట్ర క‌మ‌ల నాథులు ఎద్దేవా చేస్తున్నారు. విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల‌తోనే జ‌గ‌న్ పాల‌న చేస్తున్నార‌ని కూడా చెబుతున్నారు. మ‌రి ఇంత‌గా విమ‌ర్శ‌లు చేస్తున్న ఇదే రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కేంద్రం నుంచి వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దూత‌, కేంద్ర మంత్రం మాత్రం ఆకాశానికి ఎత్తేశారు.

అది కూడా... రాష్ట్ర బీజేపీ నేత‌ల స‌మ‌క్షంలోనే కావ‌డం.. సంచ‌ల‌నంగా మారింది. అదేస‌మ‌యంలో రాష్ట్ర బీజేపీ సార‌థి.. సోము వీర్రాజుకు భారీ షాక్ ఇచ్చింది. విష‌యంలోకి వెళ్తే.. కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్న‌కేంద్ర మంత్రులు.. కేంద్రం చేస్తున్న అభివృద్ధిని వివ‌రిస్తున్నా రు. కేంద్రం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయో.. లేదో .. ప‌రిశీలిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లకు స‌న్నాహ‌కంగా జ‌రుగుతున్న ఈ ప‌ర్య‌ట‌న‌లు ఆస‌క్తి రేపుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఏపీలో గ‌త రెండు రోజులుగా ప‌ర్య‌టిస్తున్న కేంద్ర మంత్రి డాక్ట‌ర్ ఎల్‌. మురుగ‌న్‌.. తాజాగా ఏపీ స‌ర్కారుపై ప్ర‌శంస‌లు గుప్పించారు. ప్ర‌భుత్వ పాల‌న అద్భుతంగా ఉంద‌ని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న దిశ యాప్ బటన్‌ నొక్కి పరిశీలించిన కేంద్ర మంత్రి.. సెకన్ల వ్యవధిలో కంట్రోల్‌రూమ్‌ నుంచి ఫోన్‌ కాల్ కావడంతో సంతోషం వ్య‌క్తం చేశారు. తాడేప‌ల్లిలోని 36వ డివిజన్‌ సచివాలయంలో విధుల్లో ఉన్న మహిళా పోలీస్‌ ఫోన్‌ నుంచి దిశ యాప్‌ పనితీరును ఆయన పరిశీలించారు.

ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కగా.. సెకన్ల వ్యవధిలో దిశ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఫోన్‌ రావడంతో.. కేంద్ర మంత్రే దానికి జవాబిచ్చారు. 'నేను కేంద్ర మంత్రి మురుగన్‌ను, దిశ యాప్‌ పనితీరును పరిశీలించేందుకే ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కాను' అని వారికి తెలియజేశారు. దిశ యాప్‌తో పాటు కంట్రోల్‌ రూమ్‌లు, ప్రత్యేక పోలీస్‌స్టేషన్లు, సిబ్బందిని ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించడం అభినందనీయమన్నారు. దేశంలోనే ఇలాంటి ఏర్పాటు ఏ రాష్ట్రంలోనూ లేద‌న్నారు.

దీంతో అక్క‌డే ఉన్న పార్టీ నేత‌లు.. సోము వీర్రాజు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వంటివారు.. అవాక్క‌య్యారు. ఇలా అయితే.. తాము బ‌ద్నాం కావ‌డం ఖాయ‌మ‌ని గుస‌గుస‌లాడుకున్నారు. కేంద్ర మంత్రికి ఫీడ్ ఇవ్వ‌డంలో సెక్ర‌ట‌రీ విఫ‌ల‌మ‌య్యారంటూ.. విమ‌ర్శించుకున్నారు.