Begin typing your search above and press return to search.

ముషార‌ఫ్ ప‌రారీలో ఉన్న నేర‌గాడు!

By:  Tupaki Desk   |   1 Sep 2017 11:40 AM GMT
ముషార‌ఫ్ ప‌రారీలో ఉన్న నేర‌గాడు!
X
పాకిస్థాన్ మాజీ సైనిక పాల‌కుడు ప‌ర్వేజ్ ముషారఫ్ మెడ‌కు బెన‌జీర్ భుట్టో హ‌త్య కేసు చుట్టుకుంది. ఆయ‌న‌ను ప‌రారీలో ఉన్న నేర‌స్తుడిగా స్థానిక ఉగ్ర‌వాద నిరోధ‌క‌(ఏటీసీ) కోర్టు తేల్చి చెప్పింది. పాక్‌లో ఉన్న ఆయ‌న ఆస్తుల‌ను త‌క్ష‌ణ‌మే సీజ్ చేయాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ సంద‌ర్భంగా ఏటీసీ కోర్టు న్యాయ‌మూర్తి ప‌ర్వేజ్‌ పై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. వివ‌రాలు.. పాకిస్థాన్‌ కు రెండు సార్లు ప్ర‌ధాన మంత్రిగా ప‌నిచేసిన బెన‌జీర్ భుట్టో.. త‌న 54వ ఏట 2007 - డిసెంబ‌రు 27న రావ‌ల్పిండిలో హ‌త్య‌కు గుర‌య్యారు.

ఆ స‌మ‌యంలో ఆమె పాక్ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్ర‌చారంలో ఉన్నారు. అత్యంత స‌మీపం నుంచి ఆమెపై జ‌రిగిన తుపాకీ కాల్పుల అనంత‌రం నిందితులు త‌ప్పించుకున్నారు. అయితే, దీనిపై కేసు న‌మోదు చేసిన ఏటీసీ పోలీసులు.. విచార‌ణ‌ను ముమ్మ‌రం చేశారు. దాదాపు ప‌ది సంవ‌త్స‌రాలు సాగిన ఈ కేసు విచార‌ణ అనేక కీల‌క మ‌లుపులు తిరిగింది. అయితే, దీనికి సంబంధించిన తుది తీర్పును గురువారం వెలువ‌రించారు.

ఈ కేసులో పాక్ మాజీ మిల‌ట‌రీ పాల‌కుడు ప‌ర్వేష్ ముష‌రాఫ్ పాత్ర కీల‌క‌మ‌ని వెలువ‌రించిన న్యాయ‌మూర్తి అస్గ‌ర్ ఖాన్‌.. ఆయ‌న‌ను ప‌రారీలో ఉన్న నిందితుడిగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇదే కేసులో విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న ఇద్ద‌రు పోలీసు అధికారులు అజీజ్‌ - షాజ‌ద్‌ లు ఒక్కొక్క‌రికీ 17 సంవ‌త్స‌రాల జైలు శిక్ష విధించారు. అదేవిధంగా ఒక్కొక్క‌రికీ రూ.5 ల‌క్ష‌ల చొప్పున జ‌రిమానా కూడా విధించారు. ఇక, ఇదే కేసులో ఐదుగురిని నిర్దోషులుగా కోర్టు విడుద‌ల చేసింది.