Begin typing your search above and press return to search.
మనపై అణుదాడికి పాక్ స్కెచ్
By: Tupaki Desk | 27 July 2017 1:51 PM GMTపొరుగునే ఉన్నప్పటికీ మనపై నిత్యం కత్తులు దూసే దాయాది పాకిస్థాన్ దుర్భుద్ధి మరోమారు బయటపడింది. తన ఏలుబడిలో ఉనన సమయంలో మాజీ సైనిక నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్.. ఇండియాపై అణుదాడి చేద్దామనుకున్నాడట. అయితే ఇండియా ఎక్కడ ప్రతీకార చర్యకు దిగుతుందో అన్న భయంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు ముషారఫ్ చెప్పాడట. ఈ విషయాన్ని జపాన్‌కు చెందిన పత్రిక మైనిచి షింబున్ వెల్లడించింది.
2001లో భారత్ పార్లమెంట్ పై దాడి తర్వాత ఇండియా - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలోనే భారత్ పై అణ్వాయుధాలతో దాడి చేయాలనుకున్నానని ముషారఫ్ చెప్పినట్లు ఆ పత్రిక తెలిపింది. అంతేకాదు అణుదాడి చేయాలా వద్దా అన్న ఆలోచనలతో ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపినట్లు కూడా అతను చెప్పాడు. అణ్వాయుధాల వినియోగంపై అప్పట్లో ముషారఫ్ పబ్లిగ్గానే వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ సమయంలో ఇండియాగానీ - పాకిస్థాన్ గానీ తమ మిస్సైల్స్ పై న్యూక్లియర్ వార్ హెడ్స్ ను లోడ్ చేసి ఉంచలేదని కూడా ముషారఫ్ చెప్పాడు. అయితే న్యూక్లియర్ వార్ హెడ్స్ ను లోడ్ చేసి మిస్సైల్స్ ను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారా అని ప్రశ్నించగా.. ఇండియా నుంచి ప్రతి దాడులకు భయపడి అసలు ఆ ఆలోచనను విరమించుకున్నట్లు ముషారఫ్ తెలిపాడు. ఆ తర్వాత రెండు దేశాలు యుద్ధం ఆలోచనను విరమించి ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దాయి.
కాగా, 1999లో పీఎం నవాజ్ షరీఫ్ ను గద్దె దించి పాక్ పగ్గాలను ముషారఫ్ చేపట్టాడు. 2001 నుంచి 2008 వరకు ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఏడాది కాలంగా అతను దుబాయ్ లో ఉంటున్నాడు.