Begin typing your search above and press return to search.

ముస్లిం మహిళా లోకం గళం విప్పింది

By:  Tupaki Desk   |   8 Oct 2016 10:30 PM GMT
ముస్లిం మహిళా లోకం గళం విప్పింది
X
కాలం ఎంత మారినా కొన్ని విషయాలకు సంబంధించిన అంశాల్ని చూస్తే ఆశ్చర్యకరంగా.. విస్మయానికి గురి చేసేలా ఉంటాయి. చైతన్యం గురించి తరచూ లెక్చర్లు ఇచ్చే వామపక్ష మేధావులు చాలామంది హిందూ మత ధర్మం మీదా.. సంప్రదాయాల మీదా.. సంస్కృతి మీదా వాదనల పేరిట నిత్యం దాడులు చేస్తుంటారు. సంస్కరణల రణాన్ని పూరిస్తే.. తరచూ తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు. అదే మేధావులు.. ఇతర మతాలకు సంబంధించిన అంశాలపై నోరు విప్పేందుకు సైతం ఇష్టపడరు.

ముస్లింల వరకూ వస్తే.. ట్రిపుల్ తలాక్ విషయంలో పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు ఉన్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు సైతం ట్రిపుల్ తలాక్ విధానాన్ని తప్పు పడుతుంటారు. కొన్ని అరబ్ దేశాల్లో ట్రిఫుల్ తలాక్ ను నిషేధించారని.. అలాంటిది మన దేశంలో ఎందుకు అమలు చేయరంటూ ప్రశ్నించే కొందరు మహిళలకు దన్నుగా ఉండేందుకు సైతం ఆసక్తిని ప్రదర్శించరు.

ఎందుకిలా? అంటే సమాధానం చెప్పే వారు ఉండరు. అంతదాకా ఎందుకు.. దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన విషయాల్లో కూడా భావస్వేచ్ఛ పేరిట ఇష్టారాజ్యంగా మాట్లాడే మాటలకు దన్నుగా.. వారే మాత్రం విశ్వసించని పురాణాల్ని.. అందులోని పాత్రల్ని ప్రస్తావిస్తూ తమ వాదనలు వినిపిస్తుంటారు. భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడుల విషయాన్నే చూస్తే.. దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేస్తారు. ఇలాంటి తొండి వాదనలు చేసే వారు..ట్రిపుల్ తలాక్ గురించి పెదవి విప్పే సాహసం చేయరు.

అలా అని.. ట్రిపుల్ తలాక్ కు ముస్లిం మహిళా లోకం అనుకూలంగా ఉందా? ఇలాంటి నిషేధాలు వద్దని వారు కోరుకుంటున్నారా? అంటే లేదనే చెప్పాలి. సోషల్ మీడియాలో సింఫుల్ గా మూడు సార్లు తలాక్ చెప్పేసి.. వైవాహిక బంధం బద్ధలైపోయిందని చెప్పే వైనాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ అంశంపై ఆందోళనలు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. అయినప్పటికీ.. అలాంటి అంశాలపై స్పందించే విషయంలో తరచూ నీతులు చెప్పే మేధావి నాయకులు నోరు విప్పని వైనం కనిపిస్తుంది.

ముస్లింలు పాటించే ట్రిపుల్ తలాక్ విధానాన్ని పరిశీలించాలంటూ సుప్రీం కోర్టు కోరటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు.. వీలైనంత త్వరగా ఈ విదానాన్ని తీసేయాలని కోరుతున్నారు. ట్రిపుల్ తలాక్ విధానంతో పాటు.. ముస్లిం పర్సనల్ లా బోర్డును కూడా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. షరియాలో ఉన్న చిక్కులను వివరించేందుకు ఏర్పాటైన పీఎల్ బీ పురుషపక్షపాతిగా ఉందని.. ఖురాన్ ప్రకారం పురుషులకు సమానంగా మహిళలకు సమాన హక్కులు ఉన్నాయని ముస్లిం మహిళల సంస్కర్త మరియా ఆలం వ్యాఖ్యానిస్తారు. రోజురోజుకీ పెరుగుతున్న ముస్లిం మహిళల గొంతుకు.. మేధావులు తమ వాయిస్ ను ఎందుకు జత చేయరు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/