Begin typing your search above and press return to search.

రామమందిరానికి ముస్లిం సంఘాల మద్దతు

By:  Tupaki Desk   |   31 March 2017 7:02 AM GMT
రామమందిరానికి ముస్లిం సంఘాల మద్దతు
X
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ప్రతి రోజూ ఏదో ఒక సెన్సేషనే. తాజాగా అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని సమర్ధిస్తూ లక్నోలో పోస్టర్లు వెలిశాయి. శ్రీ రామమందిర్ నిర్మాణ్ ముస్లిం కరసేవక్ మంచ్ అధ్యక్షుడు అజాంఖాన్ లక్నోలో ఇటువంటి పది భారీ పోస్టర్లను పెట్టారు.

కాగా అయోధ్య అంశంపై కోర్టు బయట పరిష్కారం చేసుకోవాలని సుప్రీం కోర్టు సూచించిన నేపథ్యంలో శ్రీరామ్ మందిర్ నిర్మాణ్ ముస్లిం కరసేవక్ మంచ్ ఈ పోస్టర్లను ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. రాముడు ముస్లింలు కూడా గౌరవించదగ్గ వ్యక్తి అని.. ఆదర్శప్రాయుడని పేర్కొంటూ పదికి పైగా భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఆజంఖాన్ కు మద్దతుగా పెద్దసంఖ్యలో ముస్లిం యువత కదలివచ్చారు. కోర్టు సూచించినట్లుగా ఎలాంటి ఘర్షణలు లేకుండా రెండు మతాల మధ్య వివాదం రేగకుండా రామమందిరం నిర్మించుకోవచ్చని వారంటున్నారు. అంతేకాదు... ఎలాంటి గొడవలు సృష్టించవద్దంటూ ముస్లిం నేతలకు పిలుపునిచ్చారు.

2014 ఎన్నికలకు ముందే బీజేపీ తన మేనిఫెస్టోలో అయోధ్య రామమందిర నిర్మాణం అంశాన్ని చేర్చింది. మొన్నటి యూపీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే రామమందిర నిర్మాణం మొదలవుతుందని భావిస్తున్నారు. ముస్లిం సంఘాలు - పలువురు నేతలు కూడా మందిర నిర్మాణానికి అనుకూలంగానే ఉన్నారు. కొందరు వ్యతిరేకిస్తున్నా కొందరు మాత్రం దీనిపై సీఎం యోగితో చర్చలకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు.. మందిరం వద్దే మసీదు కూడా నిర్మించుకునేలా ఆలోచించాలని.. అప్పుడు ఇంకా బాగుంటుందని అక్కడి కొందరు ముస్లిం పెద్దలు సూచిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/